***********************************
- భీంపల్లి శ్రీకాంత్
 సోమవారం : ఆంధ్రప్రభ  
24 - 09 - 2018

ఆధునిక తెలుగు సాహిత్యంలో గురజాడది అద్వితీయ స్థానం. తెలుగు నాటకానికి పూర్వవైభవం తెచ్చిన విలక్షణ నాటకకర్త గురజాడ. గురజాడ అనగానే వెంటనే మనకు స్ఫురణకు వచ్చే పేరు ‘కన్యాశుల్కం’. విశేష ప్రజాదరణ పొందిన నాటకమిది. ఇందులోని ప్రతిపాత్ర తనదైన ప్రత్యే కతను చాటుకుంది. గురజాడ నాటకాలే కాక కథానికలు, గేయాలు, కావ్యాలు, డైరీలు, వ్యాసాలు వంటివి రచించిన సాహిత్యవేత్త. ఈ కోవలోనే గురజాడ తెలుగు సాహిత్యంలో నూతనంగా ‘ముత్యాల సరాలు’ అనే సాహిత్య ప్రక్రియను సృష్టించాడు. తెలుగు దేశీ ఛందస్సుల సరసన ముత్యాల స రం. ఆణిముత్యం అనదగ్గది. ముత్యాల సరాల్లో చెప్పిన పూర్ణమ్మ కథ, దేశభక్తి గేయ కవితలు విశేష ఆదరణ పొందాయి.
ఈ ముత్యాల సరంలో నాల్గు పాదాలుంటాయి. మొద టి మూడు పాదాలు 14 మాత్రల చొప్పున, నాల్గవ పాదం 7 నుంచి 14 మాత్రలుండడం దీని లక్షణం. కాని, శ్రీశ్రీ ముత్యాలసరానికి నాల్గవ పాదంలో 9 మాత్రలుండాలని సూచించాడు. ముత్యాలసరం యతిప్రాసలు లేని పద్యం. ‘కొత్త పాతల మేలు కలయిక క్రొమ్మెరుంగుల క్రమ్మగన్’ అంటూ తన ముత్యాల సరాల కమితా లక్షణాన్ని ప్రకటిం చుకున్నాడు.  ఈ ముత్యాల సరాల ఛందస్సులో గురజాడ అనంతర కవులు చాలామంది రచనలు చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు.
గురజాడ ముత్యాల సరాల ఛందస్సులో అనేకం రచిం చాడు. ఈ ముత్యాల సరాలను సూటిగా, స్పష్టంగా, సరళ పదాల మేళవింపులో గురజాడ రచించాడు. ఈ ముత్యాల సరాలను గురజాడ సంస్కరకాభిలాషతో రచించాననడం అభిలషణీయం.

గుత్తునా ముత్యాల సరము
కూర్చుకొని తేటైన మాటలు
కొత్త పాతల మేలు కలయిక
క్రొమ్మెఱుంగుల చిమ్మగా
అంటూ ముత్యాల సరాల ఛందస్సుకు బీజం వేశాడు గురజాడ. ఒకరకంగా గురజాడ భాషను, సాహిత్యాన్ని సం స్కరించే పనిని మొదలుపెట్టాడు. అప్పటివరకు పద్యాలు అప్రతిహతంగా వస్తుండడంతో సామాన్య ప్రజావళికి అర్థ మయ్యే విధంగా ఈ ‘ముత్యాల సరాలు’ ఛందస్సును గుర జాడ ఆవిష్కరించాడు. ఈ ముత్యాల సరాలతోనే సమాజం లో సంస్కరణ బీజాలను నాటాడు. గురజాడ అనంతరం రాసిన కవులు ఆధునిక భావాలను సంతరింపజేస్తూ రచ నలు చేశారు. అంతేకాదు ముత్యాలసరాల ఛందస్సుతో గు రజాడ ఆధునిక భాషా వ్యవహారానికి శ్రీకారం చుట్టాడని చెప్పవచ్చు. అంతవరకు గ్రాంథికంలో నడిచిన భాషకు గుర జాడ వ్యవహారికతను జోడించి ముందుకు నడిపించాడు. అందుకే ముత్యాలసరాల ఛందస్సు కొత్తదైనప్పటికీ తెలుగు ప్రజలందరి నోళ్ళల్లో నానింది. కొత్తది ఏదైనా తెలుగు ప్రజ లు స్వీకరిస్తారనే దానికి ‘ముత్యాల సరాల ఛందస్సే’ నిదర్శనం. లోకులు మెచ్చినా, మెచ్చకున్నా ముత్యాల సరా లను సృష్టిస్తున్నానని గురజాడ స్వయంగా చెప్పుకున్నాడు. సంప్రదాయ ఛందస్సుకు కాలం చెల్లిపోయిందనీ, సమాజా నికి ఆధునిక సాహిత్యం అవసరమని భావించి నూతన ప్రక్రియ ‘ముత్యాల సరం’ ఛందస్సును గురజాడ సృష్టిం చాడు. ఈ ఛందస్సు భావికవులకు మార్గదర్శకమైంది. ప్రాచీన సాహిత్యం నుంచి ఆధునిక సాహిత్యానికి నాందీ పలికినవాడు, నాందీ వాచకమైనవాడు గురజాడ అప్పారా వు. అందుకే తెలుగు సాహిత్యంలో యుగకర్తగా, మహా కవిగా వెలుగొందాడు. గురజాడ నూతన సృష్టి అయిన ‘ముత్యాలసరం’ తెలుగుభాషా సరస్వతికి ‘కంఠాభరణం’గా చెప్పవచ్చు. గురజాడ ‘ముత్యాల సరాల ఛందస్సు’తో తన ఖ్యాతిని ఇనుమడింపచేసుకున్నాడు. ఈ ‘ముత్యాల సరాల ఛందస్సు’లో రచించిన దేశభక్తి, పూర్ణమ్మకథ, కన్యక, లవణ రాజు కల గురజాడకు విశేషఖ్యాతిని తీసుకువచ్చాయి. గుర జాడ ముత్యాల సరాల్లో ప్రధానంగా నాటకీయతను జోడిం చాడు. దేశభక్తిని ప్రభోదించాడు. కథనాలను వెలువరిం చాడు.
గురజాడ ‘పూర్ణమ్మకథ’ను కన్నులకు కట్టినట్టుగా సరళ పదాలతో చక్కగా ఆవిష్కరించాడు.
మేలిమి బంగరు మెలతల్లారా/ కలువల కన్నుల కన్నెల్లారా / తల్లుల గన్న ప్లిల్లారా
విన్నారమ్మా ఈ కథను !
కన్నులకాంతులు కలువల చేరెను
మేలిమి జేరెను మేనిపసల్
హంసల జేరెను నడకల బెడగులు
దుర్గను జేరెను పూర్ణమ్మ !
కరుణరసార్ద్రమైన గేయ ఖండిక ఇది. పూర్ణమ్మ కథను విన్నారా అంటూ కథా కథన పద్ధతిలో చెప్పిన ముత్యాల సరమిది. దీనిని చదివినవారు కన్నీరు కార్చని వారుండ రంటే అతిశయోక్తి ఏమీకాదు. పుత్తడి బొమ్మ పూర్ణమ్మను ఒక ముసలివాడికి ఇవ్వాలని కాంక్షిస్తారు తల్లిదండ్రులు. దా నికి ఒఫ్పుకోలేని పూర్ణమ్మ దుర్గమ్మలో కలిసిపోతుంది.
గురజాడ అపూర్వ సృష్టి ‘కన్యక’. పెళ్ళికాని కన్యకను చూసిన రాజు ఆమెను పొందడానికి ప్రయత్నం చేస్తే కన్యక ఆత్మాహుతి చేసుకుంటుంది. దీంతో రాజు గర్వం నశిస్తుంది. కోటలు నాశనమవుతాయి. కన్యకకు కీర్తిరాగా, రాజుకు అప కీర్తి లభించింది. దీనినే గురజాడ అద్భుతంగా ‘కన్యక’లో చక్కగా చిత్రించాడు.
పట్టమేలే రాజు అయితే
రాజునేలే దైవముండడొ?
పరువు నిలపను పౌరుషము ను
కేల కలుగదొకో?
పట్టమేలే రాజు పోయెను
మట్టికలిసెను కోట పేటలు
పదం పద్యం పట్టినిలిచెను
కీర్తులపకీర్తుల్
అంటూ రాజు గర్వం ఎలా నాశనమయ్యిందో గురజాడ చక్కని కవితాత్మకంగా వర్ణించాడిందులో.
గురజాడ రాసిన మరోగేయం ‘దేశభక్తి’ గేయం. ఇది గురజాడకు ఎనలేని కీర్తిని సంపాదించిపెట్టింది.
దేశమును ప్రేమించుమన్నా
మంచి యన్నది పెంచుమన్నా
వొట్టిమాటలు కట్టిపెట్టోయ్
గట్టి మేలు తలపెట్టవోయ్
గురజాడ దేశభక్తికి, జాతీయ దృక్పథానికి ఈ గేయం  కలికితురాయి. సందేశాత్మక దేశభక్తి ప్రభోద గేయమిది. పద్నాలుగు చరణాలున్న ఈ ‘దేశభక్తి’ గేయంలో ఒక్కో చర ణం ఒక్కో  అంశాన్ని ప్రస్తావించింది. విశ్వజనీనతకు ఈ దేశభక్తి గేయం పట్టం కట్టింది. గురజాడ రాసిన ‘మనిషి’ రచన అందరిని ఆలోచింప జేస్తుంది.
మనిషి చేసిన రాయిరప్పకి
మహిమ కలదని సాగి మొక్కుతు
మనుషులంటే రాయి రప్పల / కన్న కనిష్టం
అనే మానవతావాదాన్ని వినిపిస్తాడు. రాయిరప్పల కన్న మనుషులే హీనమంటూ ఆక్షేపిస్తాడు.
ఇంకా గురజాడ ముత్యాల సరాల ఛందస్సులో ‘లవణ రాజు కల, డామన్ పెతియస్, దించులంగరు, కాసులు, లంగరెత్తుము’ వంటివి రచించాడు. ఈ ముత్యాల సరాలను వేటికవే భిన్నంగా రచించడం గురజాడ రచనా శైలికి నిద ర్శనం. గురజాడ ఏది రాసినా అందులో మానవతా సూ త్రం కన్పిస్తుంది. ఒక సామాజిక దృక్పథం కన్పిస్తుంది. సం స్కరణాభిలాషను తెలియజేస్తుంది. సమాజానికి ఉపయోగ పడే రచనలు చేశాడు కాబట్టే తెలుగు సాహిత్యంలో గురజా డ చిరస్థాయిగా నిలిచిపోయాడు. 
గురజాడ క్రాంతదర్శి. భవిష్యత్తును దర్శించిన జ్ఞాన ద్రష్ట. అందుకే
మతములన్నియు మాసిపోవును
జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును
అంతస్వర్గ సుఖంబులన్నవి
యవని విలసిల్లున్ !
అంటాడు. భవిష్యత్ సమాజంలో మతాలన్నీ మాసిపో వుననీ, కులమతాల భేదముండదనీ, జ్ఞానమొక్కటే జెండా లా రెపరెపలాడుతుందనీ, అదొక్కటే నిలుస్తుందనీ గాఢ మైన విశ్వాసంతో ప్రకటించాడు.
యెల్ల లోకము వొక్కయిల్లై / వర్ణభేదము లెల్లకల్లై
వేల నెరుగని ప్రేమబంధము / వేడుకలు కురియ
ప్రపంచమంతా ఒకే ఇల్లుగా పరిణమిస్తుందని, వర్ణ, వర్గ, మత భేదాలు సమసిపోతాయనీ, అందరూ ఒక్కటై వే డుకలు చేసుకుంటారనీ భవిష్యత్తును ఎరిగి గురజాడ తీర్పు ఇచ్చేశాడు. నేటి వర్తమాన సమాజంలో జరుగుతున్నదదే. మనుషులందరూ మానవత్వంతో వెలగాలనే అభిలాషను గురజాడ ఆనాడే చాటి చెప్పాడు. కులాలకు, మతాలకు అతీ తంగా జీవం సాగించాలన్నాడు. అపుడే జగానికి పండుగ. జగతికి వెలుగులు నిండుగ.
తరతరాలకు నిలిచిపోయే సజీవ రచనలు చేసినవాడు గురజాడ. ఏతరమైనా గురజాడ సాహిత్యాన్ని విస్మరించ లే దు. అందుకే గురజాడ తెలుగు సాహిత్యంలో అడుగు జాడ గా బలమైన ‘పాద’ ముద్రలు వేసినవాడు. క్రాంత దర్శియై భవిష్యత్తును చూసినవాడు. ప్రజల భాషలలోనే రచనలు చే యడం గురజాడ వ్యవహార భాషోద్యమానికి పూనికలాం టిదని చెప్పవచ్చు. గురజాడ తన రచనల్లో చాలా మౌలికాం శాలను తీసుకొని రచనలు చేయడం ద్వారా అవి ప్రజలకు హత్తుకుపోయాయి. అప్పటి సమకాలీన సమాజాన్ని తన క లంతో బంధించి రచనలు చేశాడు. అంతేకాదు సాహి త్యాన్ని, సమాజాన్ని ప్రగతి మార్గంలో నడిపే ప్రయత్నం గురజాడ చేశాడని చెప్పవచ్చు. అందుకే శ్రీశ్రీ ‘సామాజిక పరిణామానికి విప్లవ పంథాలో వేగం సాధించిన మహాకవి గురజాడ’ అని ప్రస్తుతించాడు. సాహిత్యరంగంలో గురజాడ ఆ పనిచేశాడు. సమాజాన్ని మార్చే, సంస్కరించే పనిని ప్రతికాలంలో ఎవరో ఒకరు చేస్తూనే ఉంటారు. అలా ఆధు నిక కాలంలో గురజాడ తెలుగు సాహిత్యానికి వేగుచుక్కై పరిణమించాడు. సాహిత్యంలో సమాజాన్ని సంస్కరించే ప నిని మొదలుపెట్టాడు. అందుకే దేవులపల్లి కృష్ణశాస్త్రి- గురజాడ అప్పారావును ముత్యాల సరాలులోనే కీర్తిస్తూ మహాకవీ కవితా ఖండికలో ఇలా అంటాడు.
‘గుత్తునాయని మేలి ముత్యాల్ / గుచ్చినాడే మేలి సరముల
ఇత్తునాయని తెలుగు తల్లికి / ఇచ్చినాడే భక్తితో
అంటూ ముత్యాల సరాల వైశిష్యాన్ని చాటుతాడు. గురజాడ అప్పారావు నూతన సృష్టికి జేజేలు పలుకుతాడు.
*******************************
- భీంపల్లి శ్రీకాంత్
(నేడు గురజాడ జయంతి)
09/21/2018 : మనం 


నది మొగ్గలు 


***************************************
డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ 
అక్షర నేత్రం : 01 - 15 : 2018
బాల గేయం పిల్లలంటే ... 


************************************
భీంపల్లి శ్రీకాంత్ 



జీవితంలో సంతోషాలు అరుదెంచిప్పుడల్లా
ఆనందభాష్పాలు కళ్ళల్లో కాంతులీనుతాయి
కన్నీరు కళ్ళల్లో మొలిచే వెన్నెలపూలు

ఆత్మీయమైన బంధువులు దూరమైనప్పుడల్లా
మనసంతా మూగరోదనల సంధ్రమవుతుంది
కన్నీరు హృదయవేదనను దించే ఉపశమనమాత్ర
కష్టాల కడలిని నిరంతరం ఈదుతున్నప్పుడల్లా
మనసులో కన్నీటి అలజడులే ఎగిసిపడుతుంటాయి
కన్నీరు బతుకుపోరాటంలో భాగమైన ఆత్మీయనేస్తం
అనంతమైన విషాదజీవితాన్ని గడుపుతున్నప్పుడల్లా
మనసు తెగిన కాలువలా మౌనంగా రోదిస్తూంటుంది
కన్నీరు బాధలను మరిపించే ఉద్వేగ జలపాతం
దుఃఖాన్ని దాటుకుంటూ అడుగులు వేస్తున్నప్పుడల్లా
జీవితం ఆనందవిషాదాల చదరంగమవుతుంది
కన్నీరు జీవితాన్ని దాటవేసే అసలైన పన్నీరు


****************************************
భీంపల్లి శ్రీకాంత్ 
సెప్టెంబర్ : 2018 విళంబి
బాధ్రపద మాసం
సంపుటి : 16 సంచిక 8



**************************
భీంపల్లి శ్రీకాంత్ 
మన తెలంగాణ : ఆదివారం 
02-09-2018