ఆధునిక తెలుగు సాహిత్యంలో కావ్యాలకు అర్థగౌరవం నిలిపింది పీఠిక. ఈ పీఠికలు ప్రాచీన సాహిత్యంలో అవతారికలుగా అవతరించాయి. ఆంగ్ల సాహిత్య ప్రభావంతో ఆధునిక పీఠికలు తెలుగు సాహిత్యంలో తమ ప్రస్థానాన్ని కొనసాగించాయి. కావ్యపరామర్శలే పీఠికలు.పాశ్చాత్య భాషా సాహిత్యాల పరిచయం వలన గ్రంథ పరిష్కరణకు అనుబంధంగా అభివృద్ధిచెందిన ప్రక్రియ పీఠిక. కావ్యాలను పరామర్శ చేయడమే పీఠిక లక్ష్యం. కావ్యం యొక్క నేపథ్యాన్ని ఆవిష్కరించే పరిచయ వాక్యాలే పీఠిక. దీనికే భూమిక, ప్రవేశిక, అవతారిక, ఆముఖం, మున్నుడి, తొలిపలుకు, ముందుమాట, ఆశంస వంటి పేర్లు కూడా ఉన్నాయి. ఈ పీఠికలు కూడా గ్రంథాన్ని బట్టి అనేకరకాలుంటాయి. పరిశోధనాత్మకంగాను, విమర్శనాత్మకంగాను, సృజనాత్మకంగాను, శాస్త్రబద్ధంగాను ఉంటాయి. ఈ పీఠికలు గ్రంథాల లోతుపాతులను చక్కగా విశ్లేషిస్తాయి. వాటి శక్తిసామర్థ్యాలను సమర్థంగా అంచనా వేస్తాయి. అందుకే కావ్యాలలో ముందుగా పీఠికలను అర్థం చేసుకొని అవలోకిస్తే కావ్యాల విలువ అవగతమవుతుంది.
ఇలాంటి పీఠికలను తెలుగు సాహిత్యంలోని ప్రముఖులెందరో రచించి వాటికి గౌరవం తెచ్చారు. అలాంటి వారిలో ప్రముఖ సాహిత్య పరిశోధకులు డాక్టర్ కపిలవాయి లింగమూర్తి ఒకరు. కపిలవాయి తెలుగు సాహిత్యంలో సాహితీ భీష్ములు. శతాధిక గ్రంథకర్త. దాదాపు అన్ని ప్రక్రియలల్లో రచనలు చేసిన విలక్షణ రచయిత. అటు ప్రాచీనం, ఇటు ఆధునిక సాహిత్యాలను రెండు కళ్ళుగా భావించి రచనలు చేసిన బహు గ్రంథకర్త. కపిలవాయి ఏది రాసినా ప్రామాణికతను అద్దిన విమర్శాగ్రేసరుడు. చరిత్రను పట్టి చూపినా, శాస్త్రాల సారాలను వడబోసినా, కావ్యాల పరామర్శ చేసినా కపిలవాయి సహేతుకమైన పీఠికలను అందించాడు. పీఠికలకే గౌరవాన్ని ఆపాదించాడు. దాదాపు మూడు వందల గ్రంథాలకు పైగా పీఠికలను సంతరింపజేసిన కపిలవాయి తెలుగు సాహిత్యాన్ని సంపూర్ణంగా అవగతం చేసుకున్న సాహితీ ద్రష్ట డాక్టర్ కపిలవాయి లింగమూర్తి.
వివిధ గ్రంథాలకు రాసిన పీఠికల్లో సాహిత్యవిమర్శ, కావ్యపరిష్కరణ, ఆధ్యాత్మికచింతన, చారిత్రక సంపద, విజ్ఞానసంపత్తి మొదలైన అంశాలు దర్శనమిస్తాయి. ఇవన్నీ సులభశైలిలో పాఠకులను ఆకట్టుకుంటాయి.కపిలవాయి రాసిన పీఠికలను పాఠకుడు చదువలేకుండా పీఠికలే పాఠకుడిని చదివింపజేస్తాయి.అలాంటి విశిష్టశైలి కపిలవాయిది. ఆయా పీఠికలలో ప్రతి విషయాన్ని సమగ్రంగా ఆవిష్కరించడం కపిలవాయి శైలికి నిదర్శనం. ఈ పీఠికలను పరామర్శిస్తే కపిలవాయి సాహితీ పాండిత్యం, భాషావైదుష్యం, స్థలచరిత్రల విజ్ఞానం ఒక విరాట్ సాహిత్య స్వరూపాన్ని సంతరింపజేసినట్లుగా ఉంటాయి. కపిలవాయి తెలుగు సాహిత్యంలో వచ్చిన అన్ని ప్రక్రియలకు సంబంధించిన గ్రంథాలకు పీఠికలను సంతరింపజేయడం విశేషం.
కపిలవాయి పీఠికలు రెండు రకాలు. తన గ్రంథాలకు రాసుకున్నవి, ఇతర గ్రంథాలకు రాసినవి. ఏ గ్రంథాలకు రాసినా పీఠిక గౌరవాన్ని నిలిపాడు కపిలవాయి. ప్రసిద్ధ రచయితల నుంచి నేటి వర్ధమానకవుల వరకు పీఠికలను రచించాడు. తన పీఠికలకు ఆముఖం, పరామర్శిక, ముందుమాట, పర్యావలోకనం, నివేదన, మున్నుడి, భూమిక, అభివీక్షణం, సమీక్షణం వంటి పేర్లను పెట్టడం కపిలవాయి విలక్షణతకు దర్పణం. తన వయస్సులో పెద్దవారికి కూడా పీఠికలు రాయడం విశేషం.గ్రంథ సాంద్రతను బట్టి పీఠికలను చిన్నగా, పెద్దగా రాయడం కపిలవాయి లోచూపుకు నిదర్శనం. శాస్త్ర, స్థల, చారిత్రక గ్రంథాలకు పెద్దవిగా పీఠికలను కపిలవాయి సంతరింపజేశాడు. చాలా పీఠికల్లో తన అనుభవాలను జోడించాడు.
ప్రసిద్ధ రచయిత ఇమ్మడిజెట్టి చంద్రయ్య రచించిన అన్ని కావ్యాలకు లింగమూర్తి చక్కని పీఠికలను రచించాడు. ‘శ్రీ మృత్యుంజయ శతకం’ అనే శతకానికి ‘ఆముఖం’తో పీఠికను రచించాడు.“జీవుడు జీవునిగా నున్నంతవరకు మృత్యువు తప్పదు. అది తప్పినంత కాలం తద్భవం కూడ తప్పదు. అతనికి ఆ భయం కంటే మించిన భయంకరమొకటి ఉండదు. అందువల్ల అతడు మరణ భయం నుండి విముక్తుడై అమృతత్త్వమునందుడవలసి ఉన్నది. అలాంటి స్థితినే ముక్తి లేక మోక్షమని అంటారు”. మనిషికి మరణం తప్పదని, తప్పించుకోవడం కూడ సాధ్యం కాదని, ఒకవేళ మరణం సంభవించినా దాని నుండి ముక్తిపొంది మోక్షాన్ని పొందాలంటాడు.ఈ శతకం యొక్క సం పూర్ణభావాన్ని కపిలవాయి తనదైన శైలిలో ఆవిష్కరించాడు.
ప్రముఖ రచయిత నారాయణదాసు శ్రీరామాచార్యులు రచించిన ‘విశ్వకర్మ పంచబ్రహ్మల యజ్ఞం’ గ్రంథానికి కపిలవాయి చక్కని పీఠికను సమకూర్చాడు. ‘దేవతా ప్రీతికరమైన కర్మలో యజ్ఞం వైదిక కాలం నాటి ప్రక్రియ. ఆర్శర్షులు ఈ ప్రక్రియనెంతగానో అభివృద్ధిపరిచారు. ఆనాడు వారు యజ్ఞం ద్వారా సాధించని విషయం ఏది లేదంటే అతిశయోక్తి కాదు. యజ్ఞాలకు రెండు విధాల ప్రయోజనాలున్నవి. ఒకటి భౌతికం, రెండవది ఆధ్యాత్మికం. వేదవాఙ్మయంలో విశ్వకర్మ సూక్తాలకు కొదువలేదు. కాని ఇంతవరకు వానిని పంచబ్రహ్మల పరంగా వింగడించి యజ్ఞ ప్రయోజనపరంగా సందానించనివారు లేరు. ఆ లోపాన్ని గుర్తించి మిత్రులు రామాచార్యులు ఆ లోటును తీర్చినందుకు వారికి విశ్వకర్మ సంఘం ఋణపడింది’ అంటాడు.
కపిలవాయి ఏ పుస్తకానికి పీఠిక రాసినా దాని నేపథ్యాన్ని తప్పక ఉదాహరిస్తాడు.అంతేకాని గ్రంథసమీక్ష చేయడు. గ్రంథంలో ఏముంటుందో తన పరిచయ వాక్యాలలోనే వివరిస్తాడు. ఆ పరిచయ వాక్యాలతోనే పాఠకులు ఆ గ్రంథాలను చదవాలనే ఆసక్తిని కనబరుస్తాడు.ఈ ‘విశ్వకర్మ పంచబ్రహ్మల యజ్ఞం’ గ్రంథంలో కపిలవాయి ఇదే ఆసక్తిని కనబరిచేలా పీఠికను రచించాడు. ఇందులో యజ్ఞాల యొక్క ప్రశస్తిని వివరించడమే కాక దాని ఉపయోగాలు కూడా చక్కగా విశ్లేషించాడు. కపిలవాయికి యజ్ఞాల మీద మంచిపట్టు ఉందనడానికి ఈ పీఠికనే సాక్ష్యం.
భీంపల్లి శ్రీకాంత్ సంపాదకత్వంలో వెలువడిన ‘పాలమూరు కవిత’ కవితా సంకలనానికి బహుళమైన పీఠికను సమగ్రంగా రచించాడు. దీనికి పీఠికను సంతరింపజేస్తూ “కవిత్వానికి ఛందస్సే ప్రధానం కాదు. అది ధ్వన్యాశ్రయం. ధ్వని శబ్దాశ్రయం. అందువల్ల కవి కాదలచుకున్నవాడు ఛందస్సు కంటే శబ్దంపై ఎక్కువ అధికారం సంపాదించుకోవలసింది. దీన్ని ఔచిత్యమెరిగి ప్రయోగించినవారే అసలైన కవి. ఛందస్సు కవిత్వానికి మార్గం మాత్రమే కాని అదే కవిత్వం కాదు. కవి తాను చెప్పదలచిన దాన్ని గుణబద్ధంగానో, లయబద్ధంగానో చెప్పినపుడది పాఠకుని హృదయంలోకి సులభంగా దూసుకొనిపోతుంది.
పాలమూరంటే వెనుకబడిన జిల్లా. అందుకిక్కడ ఆర్థిక పరిస్థితి కంటే ప్రజల అమాయకతనే ఎక్కువ కారణంగా ఉంది. ఈ జిల్లా కూటికి పేద గావచ్చు గాని కలానికి మాత్రం కాదు. లక్ష్మీకటాక్షం లావుగా లేకున్నా సరస్వతీ కటాక్షం మాత్రం సన్నగిల్ల లేదు” అంటాడు.ఇది నూటికి నూరుపాళ్ళు సత్యం. కరవు జిల్లాగా ముద్రపడిన పాలమూరు అంటే వలసపడిన జిల్లాగా ఖ్యాతి. కపిలవాయి అన్నట్లు ఇక్కడ కవులకేం కొదువలేదు. ఇక్కడి కవులను ప్రపంచానికి పరిచయం చేయాలనే ఉద్ధేశ్యంతో వెలువడ్డ ‘పాలమూరు కవిత’కు రాసిన పీఠిక వందమంది కవుల కవితాశక్తిని, వస్తువుల వైచిత్రిని కూలంకషంగా చర్చించాడు. పాలమూరు అంటే కూలీల జిల్లా. దేశంలో ఎక్కడ భారీ నిర్మాణం జరిగినా అక్కడ పాలమూరు లేబరు చేయి పడవలసిందే. లేకుంటే దానికి పూర్ణత్వం రాదు’ అన్న కపిలవాయి మాటలు అక్షర సత్యాలు.
కపిలవాయి కావ్యాలకే కాదు పలు జీవిత చరిత్రలకు కూడా చక్కని పీఠికలను రచించాడు. రామదాసు రామగోపాలచారి ‘శ్రీశ్రీశ్రీ యోగి శంకరాంబ గారి జీవిత చరిత్ర’కు రాసిన పీఠికలో ‘జంతునాం నరజన్మ దుర్లభం. సాంఘిక శాస్త్ర ప్రకారం మానవుడు గూడ ఒక జంతువే’. అయితే ఈ మానవులనే జాతిలో జీవులకు జన్మ మాత్రం చాలా దుర్లభం. ఈ నరజన్మ లభించటం చాలా అరుదుగా ఉంది. ఈ నరజన్మలో కూడా మహామహులుగా వెలుగొందడం చాలా దుర్లభం. మహబూబ్‌నగర్ జిల్లాకు చెంది న యోగిని శంకరాంబ ప్రశస్తి గురించి కపిలవాయి ఇందులో ఆమె జీవిత విశేషాలను తెలిపాడు. శంకరాంబను కారణజన్మురాలిగాపేర్కొంటూ మహబూబ్‌నగర్ జిల్లాలో ఇట్లాంటి కారణజన్ములు, యోగులు చాలామంది కనిపిస్తారన్నాడు.
నాటక రంగానికి సంబంధించిన పీఠికలను కూడా కపిలవాయి రచించాడు. పలువురు రచించిన నాటకాలకు, నాటకరంగ చరిత్రలకు రాసిన పీఠికలు కపిలవాయి నాటకరంగంపై ఉన్న సాధికారికతను తెలియజేస్తాయి. ప్రముఖ నటులు, దర్శకులు, రచయిత దుప్పల్లి శ్రీరాములు రచించిన ‘పాలమూరు జిల్లా జిల్లా నాటక కళావైభవం’ గ్రంథానికి పీఠిక’ రాస్తూ పాలమూరు జిల్లా కళా స్వరూపాన్ని కళ్ళముందు ఆవిష్కరించాడు. నాటి జటప్రోలు, గద్వాల, వనపర్తి, గోపాలపేట, ఆత్మకూరు వంటి సంస్థానాలలో ప్రసిద్దిగాంచిన ఆయా దేవాలయ బ్రహోత్సవాల సందర్భంగా, జాతరల సందర్భంగా నాటకాలను ప్రదర్శించారని పేర్కొన్నాడు. ఏయే నాటక సమాజాలు జిల్లాలో నాటకాలు ప్రదర్శించారో ఇందులో పేర్కొన్నాడు. కళ గాని, ప్రతిభ గాని ఒకే రకమని కాదు.వానికి సహస్రముఖాలు. కనుక ప్రతిభ ఒకరి సొత్తనే కాదు. ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకమైన ప్రతిభ నిక్షిప్తమై ఉంటుందని అంటూ కళాకారుల ప్రతిభను కొనియాడుతాడు.
ప్రముఖ కవి, పరిశోధకులు డాక్టర్ కూరెళ్ళ విఠలాచార్య రచించిన ‘శిల్పాచార్యులు’ ఖండకృతికి చక్కని పీఠికను ‘పరామరిక’ పేరుతో కపిలవాయి సంతరించాడు. ఇరవైఐదు ఖండికల పద్యకృతి ఇది. ప్రముఖులను కీర్తిస్తూ రచించబడ్డ పద్యకావ్యమిది. దీనికి కపిలవాయి పీఠిక రాస్తూ ‘ఇది దైవస్తుతి మరియు మాతృస్తుతితో ప్రారంభమై కావ్యలక్షణాన్ని సంపూర్ణంగా సంతరించుకున్నది. ఈ కృతి పేరు ‘శిల్పాచార్యులు’. కవిత్వమనేది గూడ ఒక శిల్పమే. అది సామాన్య శిల్పం గాదు అక్షరశిల్పం. కాబట్టి కవి గూడ శిల్పియే అవుతాడు. అందున విఠలాచార్య సామాన్యమైన శిల్పిగాడు. సువర్ణశిల్పి. వీరు ఇందులో భువనగిరితో సంబంధమున్న ఇరువది ముక్తాలను శిల్పించి వారిని అక్షరమూర్తులను చేసినారు’. అని అంటాడు.
చక్కని శిల్పంతో ఈ పద్యాలను రచయిత రచించాడని ప్రశంసిస్తాడు. సాహిత్యసమార్చగా ఈ కృతిని కపిలవాయి అభివర్ణిస్తాడు.
పరిశోధన అనగానే కపిలవాయి గుర్తుకొస్తాడు. పరిశోధకులకే పరిశోధకుడు. పరిశోధనలు వెలుగులోకి రావడానికి ప్రధాన కారకుడు. ఎన్నో పరిశోధన గ్రంథాలకు తన పీఠికలతో ప్రాచుర్యం కల్పించినవాడు. డాక్టర్ విట్టా వేణుగోపాల్ పిహెచ్.డి పరిశోధన గ్రంథమైన ‘ప్రాచీనాంధ్ర సాహిత్యంలో గిరిజన జీవన చిత్రణ’కు బహుళ పీఠికను ‘సంస్కృతీ ఆరణ్యక’తో రచించాడు. ఇందులో ‘ఆధునిక చరిత్ర ప్రకారం ఆదిమమానవులంతా గిరిజనులే. ప్రజ్ఞా పాటవాల వికాసమారంభమైన పిమ్మటనే వారడవులు, కొండలు విడిచి మైదానాలకు వచ్చి గ్రామాలనేర్పరచుకోసాగినారు. ఈ సత్యం మనకు పురాణవాఙ్మయంలో కన్పిస్తుంది’ అంటాడు. అంతేకాదు మన ప్రాచీన సాహిత్యమంతా ప్రభువుల ఆస్థానంలోనే వర్ధిల్లింది. ఇందులో గిరిజనులకు చోటెక్కడిది? ఒక్క కాళహస్తి మహత్మ్యంలో తిన్నడు, ఆముక్తమాల్యదలో మాలదాసరి ఇద్దరు మాత్రమే మనకు ప్రాచీన కావ్యాలలో గిరిజనులకు, హరిజనులకు ప్రతినిధులుగా కన్పిస్తారు’ అంటాడు. నిజమే ప్రాచీన సాహిత్యాన్ని తవ్వితే చాలా తక్కువగా ఈ వర్గాల సాహిత్యం వచ్చిందనేది వాస్తవం. కపిలవాయి ఏ అంశాన్ని రాసిన దానికి సాధికారికతను, ప్రామాణికతను అద్దాడు. తన పీఠికలలో ఆయా అంశాలకు తగ్గట్టు ఉపకథలను, చరిత్రలను, పురాణాలను సూచనప్రాయంగా వెల్లడిస్తాడు. అన్ని అంశాల్లో తగిన పట్టు కలిగిన కపిలవాయి ‘సంపూర్ణ సారస్వత మూర్తి’ అనడంలో ఎలాంటి అతిశయోక్తి కాదు.
ప్రసిద్ధకవి, రచయిత, పరిశోధకులు వైద్యం వేంకటేశ్వరాచార్యులు రచించిన అనేక గ్రంథాలకు కపిలవాయి విఫులమైన పీఠికలను రచించాడు. వైద్యం పరిశోధనను ప్రశంసిస్తూ ‘వేంకటేశ్వరాచార్యులే విషయాన్ని తీసుకున్న దాన్ని క్షోదక్షేమంగా మన్నించక తలదర్శిగా స్పృశించక దానిని పైపైని మాత్రమే తడివి విడిచిపెట్టారు. ఇది వారి పరిశోధనా నైజం’ అంటాడు. వైద్యం రచించిన ‘సుదర్శన చక్రరాజ శతకం’ గ్రంథానికి రాసిన పీఠికలో మంత్ర శాస్త్రపరంగా సుదర్శన చక్రం ప్రాశస్త్యాన్ని తెలిపి దా నితో పా టు చక్ర పురుషుని మూర్తుల యొక్క చిత్రాలు గూ డ జో డించడం అతని వివరణకెంతో వన్నె తెచ్చింది’ అంటాడు.
కపిలవాయికి స్థలచరిత్రల మీద మక్కువ ఎక్కువ. ఆ వాసన తన కొడుకైన కిశోర్‌బాబును పరిశోధించే స్థాయికి తీసుకెళ్ళింది. అందుకే ‘నాగర్ కర్నూలు గ్రామాలుచరిత్ర’ అనే అంశంపై కిశోర్‌బాబు ఎంఫిల్ చేసి స్థల చరిత్రలను వెలుగులోకి తెచ్చాడు. దీనికి పీఠిక రాస్తూ ‘గ్రామాలకపుడు రెండురకాల వ్యుత్పత్తులున్నవి, వానిలో జానపదులు కల్పించుకున్నవి వేరు, చారిత్రక పరిశీలకులు గమనించిన వృత్తాంతాలు వేరు’ అంటూ గ్రామ చరిత్రల యొక్క విశేషాలను తెలుపుతాడు. ఇట్లా కపిలవాయి తన పుస్తకాల కోసం, ఇతరుల పుస్తకాల కోసం రాసిన పీఠికలు సర్వజనామోదంగా ఉండడం, పీఠికా రచనకే వన్నె తేవడం విశేషం. కపిలవాయి తనదైన పాలమూరు భాషలోనే ఈ పీఠికలన్నీ రచించడం మరొక విశేషం.  తెలుగుసాహిత్యంలో కపిలవాయి పీఠికలు అజరామరంగా ప్రసిద్ధి పొందుతాయని ఆశించడంలో ఎంతమాత్రం ఆతిశయోక్తి లేదు.
***************************************

డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్
మన తెలంగాణ : దినపత్రిక 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి