🌷 కవితా మొగ్గలు 🌷

నేటి నిజం దినపత్రిక  28-03-2018


కవిత్వం పదాల తోరణమేమి కాదు
పేదవాడి గుండెను తడిమే ఆప్తనాదం
కవిత్వమంటే అక్షరాలతో వెలిగే కిరణం

కవిత్వం అక్షరాల పూదోటేమి కాదు
అవినీతి అక్రమాలకు సింహస్వప్నం
కవిత్వమంటే అధర్మానికి నిరసనగీతం

కవిత్వం చైతన్య గీతికలేమి కాదు
సమాజాన్ని తట్టిలేపే సమరనాదం 
కవిత్వమంటే సామాజిక యుద్ధరంగం

కవిత్వం అపురూప వర్ణనలేమి కాదు
అన్యాయాన్ని ప్రశ్నించే శంఖారావం
కవిత్వమంటే కుట్రలను ఛేదించే గాండీవం

కవిత్వం సామాజిక చింతనేమి కాదు
మానవత్వాన్ని పూయించే కవితాపుష్పకం
కవిత్వమంటే సమతమమతల తోరణం

కవిత్వం సమస్యల రణమేమి కాదు
సామరస్య సాధనల దిక్సూచిమంత్రం
కవిత్వమంటే సామాజికతకు దర్పణం

కవిత్వం ఊహల ఊయలేమి కాదు
ఉగ్రవాద ఉన్మాదాన్ని ఎదిరించే కరవాలం
కవిత్వమంటే ఉప్పెనలా పొంగే కెరటం

కవిత్వం అక్షరాల పొందికేమి కాదు
భాషా వికాసానికి నిత్య తారకమంత్రం
కవిత్వమంటే సృజనాత్మక భాషాపరిమళం

కవిత్వం సాహితీ సౌరభమేమి కాదు
ప్రపంచాన్ని పహారాకాసే మణిదీపం
కవిత్వమంటే సమాజహితపు చైతన్యం

కవిత్వం ఆలోచనల తరంగమేమి కాదు
వాస్తవాన్ని ముద్దాడే అసలైన వసంతం
కవిత్వమంటే అనుభవాల అక్షరసంద్రం

✍✍🌷 డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ 🌷
📺 తెలంగాణ తేజోమూర్తులపై ఆకాశవాణిలో ప్రసంగం 📺





✍✍ 🎤🎤 డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ ⚘🌷

 🎉🎉పాలమూరు సాహితి అవార్డుకు 
కవితా సంపుటాలు ఆహ్వానం 🎊🎊

నవ తెలంగాణ 02-04-2018 

నమస్తే తెలంగాణ 02-04-2018 

గణేష్ దినపత్రిక 27-03-2018

✍✍🌱 డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ ⚘🌷

🌷 రైతు మొగ్గలు 🌷

గణేష్ దినపత్రిక 27-03-2018

ఆకాశం ఆనందభాష్పాలను రాల్చినప్పుడల్లా
రైతన్న గుండె పరవశించిపోతూనే ఉంటుంది 
ఆకాశం నీరే రైతన్న పంటకు పన్నీరు

రైతన్న వానమొగుల్లను చూసినప్పుడల్లా
అక్కరకురాని చుట్టం వానచినుకే అవుతుంది
నిత్యగాయంలా వానకోసం ఎదురుచూపు

ప్రకృతిలో వానకాలం చిగురించినప్పుడల్లా
రైతన్న గుండె తండ్లాడుతూనే ఉంటుంది
జీవితాంతం వానకోసమే రైతన్న బతుకు

రైతన్న మట్టికోసం బతుకుతున్నప్పుడల్లా
అది మమకారాన్ని పంచుతూనే ఉంటుంది
మట్టి అన్నంముద్దను ప్రసవించే అమ్మ

మట్టిలో విత్తనాలు మొలకెత్తినప్పుడల్లా
రైతన్న కంట్లో ఆశలూరుతూనే ఉంటాయి
కాలం కలిసొస్తేనే రైతన్నకు పండుగ

✍✍ డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ ⚘🌷
30న తెలంగాణ సారస్వత పరిషత్ మహోత్సవం











✍✍ డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ ⚘🌷
*అలరించిన అష్టావధానం*







✍✍🌾  డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ ⚘🌷


నవ్య మీడియా Mar 25, 2018, 


పల్లెను ఆత్మీయాలింగనం చేసుకున్నప్పుడల్లా
మది మధురానుభూతుల సంద్రమే అవుతుంది
పల్లె అంటే పసిడిమనసుల మకరందధామం

పచ్చని పాడిపంటలతో అలరారినప్పుడల్లా
పల్లెతల్లి నిత్యం పండుగనే చేసుకుంటుంది
పల్లె అంటే సిరులను కురిపించే కల్పవల్లి

ప్రకృతి పచ్చందనాలతో పరవశించినప్పుడల్లా
పక్షుల కిలకిలరావాల సందడే అవుతుంది
పల్లె అంటే హరితవనపు రుతురాగాల హరివిల్లు

అనుబంధాల ఆత్మీయలతలు అల్లుకున్నప్పుడల్లా
మమకారపు అనురాగాలను పంచుతూనే ఉంటుంది
పల్లె అంటే బంధాలను మోసే మమతలమాగాణం

కష్టసుఖాలను కడుపులో నిత్యం మోస్తున్నప్పుడల్లా
సహనానికి మారుపేరుగా నిలుస్తూనే ఉంటుంది
పల్లె అంటే బాధలను దిగమింగే గరళకంఠం

కల్మషమెరుగని కారుణ్యదీపమై వెలిగినప్పుడల్లా
కరుణామయియై అందరిని అక్కున చేర్చుకుంటుంది
పల్లె అంటే స్వార్థమెరుగని నిస్వార్ధపు దేవాలయం

అందరినీ తన ఒడిలో తల్లిలా దాచుకున్నప్పుడల్లా
ఆప్యాయతల గంధాలను పంచుతూనే ఉంటుంది
పల్లె అంటే ప్రేమానురాగాలను పంచే పుట్టినిల్లు

ప్రభాతకిరణాల వెలుతురులో నిద్రలేచినప్పుడల్లా
సుప్రభాతంలా కోడికూతై ఆలపిస్తూనే ఉంటుంది
పల్లె అంటే ఉదయాన్ని తట్టిలేపే ఉషోదయరాగం

కోయిలరాగాలతో చిలుకపలుకులు పలికినప్పుడల్లా
సప్తస్వరాలను పలికించే సంగీతకచేరే అవుతుంది
పల్లె అంటే మమతానురాగాల మరుమల్లెగంధం

సమైక్యత భావాలకు వేదికలు అవుతున్నప్పడల్లా
రచ్చబండ వెలుగు పంచే దివిటీనే అవుతుంది
పల్లె అంటే న్యాయాన్ని వెలిగించే దీపికలు

✍✍🌷-భీంపల్లి శ్రీకాంత్🌷🌷