చెరువు మొగ్గలు 
భాగ్యనగర్ పోస్ట్ మాసపత్రిక మార్చి 2018
వానచినుకులు నేలపై పడితేనే కదా
తడారిన గుండె పకపకనవ్వేది
చినుకులంటే చెరువుకు పండుగ

కాలువలు నిత్యం ప్రవహిస్తేనే కదా
చెరువులు సంతోషంగా కళకళలాడేది
కాలువలు చెరువులకు చెలెమెలు

చెరువులు నిండుగా నిండితేనే కదా
పల్లెంతా పచ్చదనమై పరవశించేది
చెరువులు పల్లెలకు జలరాశులు

చెరువుతో పల్లె పచ్చగుంటేనే కదా
జీవితం బృందావనమై వికసించేది
చెరువుంటే పల్లెకు నిత్యవసంతం

నిరంతరం ప్రయత్నం చేస్తేనే కదా
ఎండిన చెరువు గణపసముద్రమయ్యేది
కరువును తరిమిన మిషన్ భగీరథ 

బీడువడిన చెరువు కళకళలాడితేనే కదా
వలసపక్షులు తిరిగొచ్చి పంటపై వాలేది
కరువుపై కృష్ణమ్మతల్లి నీటి సంతకం  

చెరువు నిండి అలుగుపారితేనే కదా
రైతన్నల పంటపండి కడుపునిండేది
అలుగు పారిందా అది గణపసముద్రమే

ముప్పై ఏళ్ల కల సాకారమైంతుందంటే
భగీరథుడి విశ్వప్రయత్నం ఫలించినట్టే
అపర భగీరథుడు నీళ్ల నిరంజనుడు

ఎత్తిపోతలను ఒడిసిపట్టుకుంటేనే కదా
ఎండిన చెరువులు నిండుకుండయ్యేది
చెరువులన్నీ ఇపుడు సప్తసముద్రాలు

ఎడారైన చెరువులు నిండినపుడే కదా
తెలంగాణ భూములు పచ్చబడేవి
రైతు బతుకుకు తెలంగాణ భరోసా 

🌷డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ 🌷


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి