🌷 నవ్య మీడియా : మర్చి : 07, 2018 
రాయడానికేముంది
వస్తువులు అన్నీ అయిపోయినంక
అనుకుంటామా
ఇంకా ఏదో మిగిలే ఉంటుంది

కవిత్వీకరించడానికేముంది
కవులంతా వస్తువులను మింగేసినంక
అనుకుంటామా
ఇంకా ఏదో మిగిలే ఉంటుంది

సూర్యుడు రోజూ కిరణాలను ప్రసరిస్తున్నా
వెలుగును పంచే ఉదయాలు అవే
చంద్రుడు రోజూ వెన్నెలను వెదజల్లుతున్నా
చల్లదనం కురిపించే వసంతరాత్రులు అవే

నది నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుందా
ఏదో కొత్త దారిని వెతుక్కుంటుంది
కాలువ పరవళ్లు తొక్కుతూనే ఉంటుందా
ఏదో సరికొత్త బాటను తొక్కుతుంది

మనం ఇంకా బతికున్నామంటే
ఏదో కొత్త చూపును చూస్తున్నట్టే
మనం ఇంకా తింటున్నామంటే
ఏదో కొత్త రుచిని ఆస్వాదిస్తున్నట్టే

అనంతాన్ని అక్షరాలలో బందిస్తూనే
రవిగాంచని చోట దార్శనికుడవుతాడు
ప్రకృతిని పదాలలో అభిషేకిస్తూనే
ప్రపంచాన్ని అద్దంలా పట్టిచూపుతాడు

ఎంతగా కవిత్వం రాసినా…
ఇంకా ఏదో మిగిలే ఉంటుంది
కవిగుండెల్లో ఏదో కెలుకుతూ ఉంటుంది
అవును…
ఇంకా కవిగుండె కొట్టుకుంటూనే ఉంటుంది
కవికలం కొత్త వస్తువు కోసం 
నిత్యం ఎదురుచూస్తూనే ఉంటుంది

🌷డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ 🌷


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి