* 🌷రైలు మొగ్గలు🌷*

గణేష్ దినపత్రిక 03-03-2018

ప్రకృతిని నిత్యం తనలోకి ఒంపుకుంటూనే
పిల్లతెమ్మెర గాలులతో చెలిమి చేస్తుంది
రైలు ప్రయాణీకులను సాంత్వనపరిచే నేస్తం

ప్రపంచాన్ని సరికొత్తగా పరిచయం చేస్తూనే
అపరిచితులతో ఆలింగనం చేయిస్తుంది
రైలు అనుబంధాలను సృజించే వాహిక

రాత్రీ పగలు అంటూ తేడా లేకుండానే
నిరంతరం ప్రయాణికుల గమ్యాన్ని చేరుస్తుంది
రైలు దూరతీరాలను కలిపే వంతెన

ఒంటరి పక్షులకు ఆసరా అవుతూనే
అనాధలకు ఆశ్రమంలా ఆశ్రయాన్నిస్తుంది
రైలు అభాగ్యులకు నిత్య కల్పతరువు

కొండకోనల్లో వయ్యారంగా పరుగిడుతూనే
పక్షుల కిలకిలరావాలను కమ్మగా పాడుతుంది
రైలు సంగీతాన్ని వినిపించే రాగాలపల్లకి

విభిన్న మనుషులతో చెలిమి చేయిస్తూనే
కొత్త అనుబంధాలకు శ్రీకారం చుడుతుంది
రైలు సరికొత్త బంధాలను కలిపే వారధి

గమ్యాన్ని చేరాలని ఉబలాటపడుతుంటే
సిగ్నల్ అడ్డంకులు తగులుతూనే ఉంటాయి 
రైలు ప్రయాణమంటే జీవితకాలం లేటు

మనిషికి జీవితపాఠాలను నేర్పుతూనే
సప్తవర్ణాల ఇంద్రధనుస్సు అవుతుంది
రైలు రంగురంగుల ప్రపంచపు నవలోకం

కళాకారుల పాటలను అందంగా వినిపిస్తూనే
హృదయాలను ఆనందపరవశుల్ని చేస్తుంది
రైలు సకల కళాకారులకు సౌభాగ్యనిలయం

విభిన్నమైన ప్రపంచాన్ని తనతో తీసుకెళ్తూనే
సరికొత్త రంగస్థల జీవితాన్ని ప్రదర్శింపజేస్తుంది
రైలు నవరసాల నాటక సమ్మేళనం

✍✍🌷⚘డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ ⚘🌷

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి