🌷 మహిళా  మొగ్గలు

గణేష్ దినపత్రిక  10-03-2018

ఆమె బాధల కన్నీళ్లను దిగమింగుకుంటూనే
కష్టాల కడలిని భారంగానే ఈదుతున్నది
అవనికుండే సహనం ఆమె సొంతం

ఆమె రోజూ నిద్రలోంచి మేల్కొననిదే
ఈ జగతికి ఉషోదయం ఉండదు
ఆమె వెలుగు పంచే అరుణకిరణం

ఆమె ఉదయాలను వెలిగిస్తేనే కదా
ఈ లోకం నిత్యం ప్రకాశమానమయ్యేది
ఆమె చీకటిని జయించే వెలుగురేఖ

ఆమె కష్టాల ఒడిదుడుకులను ఓర్చుకుంటూనే
కరుణాసముద్రమై ఆవలితీరం దాటుతుంది
ఆమె మానవజాతికి దక్కిన మణిహారం

ఆమె నిత్యం కాలంతో పయనిస్తూనే
తన ముద్రలను బలంగా వేస్తూనే ఉంది
ఆమె ఆకాశంలో సగమైనప్పటికీ అనంతం

ఆమె నిత్యం కొవ్వొత్తిలా కరిగిపోతూనే
భవితకు వెలుగులు పంచుతూనే ఉంటుంది
ఆమె బతుకుబండిని నడిపించే చుక్కాని

 ఆమె అవమానాల చెలియలికట్టను దాటుతూనే
ఆనందాన్ని పంచే కరుణామూర్తియై అలరిస్తుంది
ఆమె అన్నింటినీ సహించే అపరభూదేవి

ఆమె ఎండమావి బతుకులను చిగురింపజేస్తూనే
ఒయాసిస్సుల జీవితాన్ని చక్కగా వెలిగిస్తుంది
ఆమె ఎడారిలో పూచిన పూలపరిమళం

ఆమె సంసారసాగరాన్ని నిత్యం ఈదుతూనే
జీవితనౌకను అవలీలగా దరికి చేరుస్తుంది
ఆమె జీవనజ్యోతిని వెలిగించే ప్రేమమూర్తి

ఆమె సకలకళారంగాల్లో పాదముద్రలు వేస్తూనే
అవనికే వెలుగునిచ్చే మహారాణి అవుతుంది
ఆమె విజయాన్ని ముద్దాడే ఉత్తుంగతరంగం


✍✍🌷⚘డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ ⚘🌷

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి