🌷 నవ్య మీడియా : 04 మర్చి : 2018 

ఏమిటి ఈ ఘోరం…!
ఏమిటి ఈ నరమేధం…!!

మల్లెపువ్వులా పరిమళించాల్సిన బాల్యం
కసాయి ముష్కరుల చేతిలో
తుపాకిగుళ్ళకు బలికావడమేమిటి

బుడిబుడి నడకలతో బడికెళ్ళాల్సిన బాల్యం
సైనికుల దారుణమైన రాక్షసక్రీడలో
రక్తపుమడుగులో ఊయలలూగడమేమిటి

పిల్లలు రేపటి ఆశాకిరణాలు కదా !
భావికి బాటలు వేసే పునాదులు కదా !!

ఏమిటి ఈ రాక్షసత్వం !
ఏమిటి ఈ మరణమృదంగం !!

అగ్రరాజ్యాల అహంకార రక్తదాహానికి
సిరియా దళాల కర్కశ చేతుల్లో
బంగరుబాల్యం సమిధగా మారడమేమిటి
నియంతల నిరంతర ఆధిపత్యకాంక్షకు
నరరూప రాక్షసుల క్రూరత్వానికి
సిరియా మృత్యుశాలై శ్మశానం కావడమేమిటి

పిల్లలు కల్లాకపటమెరుగని నవ్వులు కదా !
రేపటి సూర్యోదయానికి విచ్చుకునే మొగ్గలు కదా !!

అగ్రరాజ్యాల ఉగ్రవాద ఉన్మాదానికి
ఏ పాపమెరుగని బోసినవ్వులపై 
మారణహోమం సృష్టించడమేమిటి
నియంతృత్వ ఆధిపత్య అరాచకానికి
కల్మషమెరుగని పసికూనలపై
రక్తం ఏరులై కాలువగా పారడమేమిటి
పిల్లలు అమాయక జీవులు కదా !
లేలేత హృదయాల శాంతిసుమాలు కదా !!
          
ఓ నియంతలారా…!
పసిపిల్లల ఆర్తనాదాలు మీరెపుడైనా విన్నారా
ఓ సైనికులారా…!
చిన్నారుల హాహాకారాలు మీరెపుడైనా కన్నారా

వెళ్ళండి…!
మళ్ళీ మళ్ళీ వెళ్ళండి…!
మీ బాల్యాన్ని జ్ఞాపకాలతో తడమండి
ఉక్కిరిబిక్కిరి చేసే అల్లరితో ఊపిరవ్వండి

ఏ పాపం చేశారని వారికీ మరణం
ఏ నేరం చేశారని వారికీ నరకం

వెళ్ళండి…!
మళ్లీ మళ్ళీ మళ్ళీ వెళ్ళండి…!
మీ పాపాలను కడిగేసుకుని రండి
మీ చేతులతో బాల్యాన్ని కాపాడండి
చిన్నారుల నవ్వులను మళ్ళీ బతికించండి !
బంగారు బాల్యాన్ని పూలతోటలా మర్చండి !!

🌷డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ 🌷

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి