నవ్య మీడియా Mar 25, 2018, 


పల్లెను ఆత్మీయాలింగనం చేసుకున్నప్పుడల్లా
మది మధురానుభూతుల సంద్రమే అవుతుంది
పల్లె అంటే పసిడిమనసుల మకరందధామం

పచ్చని పాడిపంటలతో అలరారినప్పుడల్లా
పల్లెతల్లి నిత్యం పండుగనే చేసుకుంటుంది
పల్లె అంటే సిరులను కురిపించే కల్పవల్లి

ప్రకృతి పచ్చందనాలతో పరవశించినప్పుడల్లా
పక్షుల కిలకిలరావాల సందడే అవుతుంది
పల్లె అంటే హరితవనపు రుతురాగాల హరివిల్లు

అనుబంధాల ఆత్మీయలతలు అల్లుకున్నప్పుడల్లా
మమకారపు అనురాగాలను పంచుతూనే ఉంటుంది
పల్లె అంటే బంధాలను మోసే మమతలమాగాణం

కష్టసుఖాలను కడుపులో నిత్యం మోస్తున్నప్పుడల్లా
సహనానికి మారుపేరుగా నిలుస్తూనే ఉంటుంది
పల్లె అంటే బాధలను దిగమింగే గరళకంఠం

కల్మషమెరుగని కారుణ్యదీపమై వెలిగినప్పుడల్లా
కరుణామయియై అందరిని అక్కున చేర్చుకుంటుంది
పల్లె అంటే స్వార్థమెరుగని నిస్వార్ధపు దేవాలయం

అందరినీ తన ఒడిలో తల్లిలా దాచుకున్నప్పుడల్లా
ఆప్యాయతల గంధాలను పంచుతూనే ఉంటుంది
పల్లె అంటే ప్రేమానురాగాలను పంచే పుట్టినిల్లు

ప్రభాతకిరణాల వెలుతురులో నిద్రలేచినప్పుడల్లా
సుప్రభాతంలా కోడికూతై ఆలపిస్తూనే ఉంటుంది
పల్లె అంటే ఉదయాన్ని తట్టిలేపే ఉషోదయరాగం

కోయిలరాగాలతో చిలుకపలుకులు పలికినప్పుడల్లా
సప్తస్వరాలను పలికించే సంగీతకచేరే అవుతుంది
పల్లె అంటే మమతానురాగాల మరుమల్లెగంధం

సమైక్యత భావాలకు వేదికలు అవుతున్నప్పడల్లా
రచ్చబండ వెలుగు పంచే దివిటీనే అవుతుంది
పల్లె అంటే న్యాయాన్ని వెలిగించే దీపికలు

✍✍🌷-భీంపల్లి శ్రీకాంత్🌷🌷

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి