🌷 ప్రకృతి పరవశం 🌷

ఆంధ్రజ్యోతి మహబూబ్ నగర్ 15-మార్చి 2018

రాలిపోయిన ఆకులు మళ్ళీ చిగురిస్తేనే కదా
ప్రకృతి పరవశంతో ఆనందంగా నాట్యమాడేది
నవరస పరిమళాల షడ్రుచుల పండుగ ఉగాది

కాలం కొత్త చిగురులను తొడిగితేనే కదా
జీవితం వసంతమై నవోన్మేషంగా పల్లవించేది
సుఖసంతోషాల చెరకుతీపి పండుగ ఉగాది

మదిలో చేదుజ్ఞాపకాలను మరిచిపోతేనే కదా
ఆనందాల అనుభూతులను అనుభవించేది
చేదు జ్ఞాపకాల వేపపూత పండుగ ఉగాది

వసంతకోకిల కవితాగానం చేస్తేనే కదా
మామిడితోరణాలు స్వాగతగీతం పలికేది
వగరుపంచే మామిడికాయ పండుగ ఉగాది

కష్టసుఖాలు జీవితంలో భాగమైపోతేనే కదా
కడవరకు బతుకుబండిని నేర్పుగా నడిపేది
చింతపండు పులుపు పండుగ ఉగాది

షడ్రుచులను జీవితంలో రుచిచూస్తేనే కదా
మంచిచెడులను సమన్వయంతో స్వీకరించేది
సహనం నేర్పే మిరపకారం పండుగ ఉగాది

కొత్తవసంతం ఉల్లాసంగా అడుగిడితేనే కదా
ఉత్సాహంగా జీవితం నవరసభరితమయ్యేది
రుచికి సంకేతమైన ఉప్పు పండుగ ఉగాది

✍✍🌷డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ 🌷

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి