🌷🌷 *ఆ నవ్వులు.....!*🌷🌷

ఆ నవ్వులు
కల్మషం లేని సిరిమల్లెలు
ఆ నవ్వులు
సుగంధాలను వెదజల్లె పువ్వులు
ఆ నవ్వులు
ఆకాశాన మెరిసే తారాజువ్వలు

అవును...
ఆ నవ్వులే లేకపోతే
అందమైన సుందరప్రపంచం ఎక్కడిది
ఆ నవ్వులే దూరమైతే
మధురమైన బాల్యం మనకింకెక్కడిది

అమాయకంగా విరిసే
ఆ నవ్వులను చూస్తే
సరికొత్త ప్రపంచం బృందావనమై
అలరింపజేస్తుంది
ఆ నవ్వులను ఆస్వాదిస్తే
ఆకాశాన విరిసే హరివిల్లై
ఆనందాలను పంచుతుంది

అవును... బాల్యం
జీవితపుస్తకంలో మధురానుభూతుల అధ్యాయం
ప్రతి పేజీలోనూ ఎప్పటికీ మరచిపోలేని జ్ఞాపకాలే
తీపిగుర్తులను పంచే మమతానురాగాల సంగమం
ప్రతి జ్ఞాపకాల్లోనూ ఎన్నటికీ చెరిగిపోని సంతకాలే

బాల్యానిది ఎప్పుడూ నవ్వుల ప్రపంచమే
నందనవనంలో విహరించే స్వర్గలోకమే

బాల్యం...
మనిషి జీవనగమనానికి తొలిపొద్దు
మనిషిగా ఎదగడానికి ఆయువుపట్టు
మనీషిగా మారడానికి తేనేపట్టు


*********************************
*✍ ✍🌷 డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ 🌷*
📰 నవ్య మీడియా 📰 :🌷 08-08-2018 🌷

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి