కాలంతో పాటు కవిత్వంలో కూడా మార్పులు వస్తున్నాయి. ఆధునిక కాలంలో వచన కవిత్వానిది అగ్రస్థానం. తెలుగు సాహిత్యాన్ని నిలబెట్టింది ఒక్క వచన కవిత్వం మాత్రమే. మార్పు అనేది కాలంతో పాటు రావడం అనివార్యం. అది సాహిత్యంలోనూ తొంగిచూసింది. వచన కవిత్వం అనంతరం దీర్ఘ కవిత్వం, మినీ కవిత్వం ఒక దశలో రాజ్యమేలాయి. ఆ తర్వాత ముక్తకాలు, రుబాయిలు, గజళ్ళు, హైకూలు, నానీలు, రెక్కలు, నానీలు, వ్యంజకాలు వంటి సరికొత్త కవితా ప్రక్రియలు ఆవిర్భవించాయి. పాఠకులు కొత్తను ఆహ్వానిస్తుందనడానికి ఇవే నిదర్శనాలు.

ఇదే బాటలో మొగ్గలు అనే సరికొత్త ఆధునిక కవితా ప్రక్రియ మొగ్గ తొడిగింది. ఇది మూడు పాదాల కవిత్వం. మొదటి రెండు పాదాలు ఒక అంశాన్ని భావయుక్తంగా, అర్థవంతంగా చెబితే మూడవ పాదం దానికి సమర్థింపు వాక్యంగా ఉంటుంది. అయితే మొదటి పాదానికి రెండవ పాదం కొనసాగింపుగా ఉంటుంది. అవి ఒక సంశ్లిష్ట వాక్యంలా ఉంటుంది. దీనిని సమర్థిస్తూ, అన్వయిస్తూ, బలపరుస్తూ మూడవ పాదం ముక్తాయింపుగా ఉంటుంది. ఈ మూడవ పాదమే మొగ్గలను వికసింపజేసేది. ఈ మూడవ పాదాన్ని బలంగా చెబితేనే మొగ్గలు కవితా ప్రక్రియ తెలుగు సాహిత్యంలో బలంగా నాటుకుపోతుంది. ఈ మూడవ పాదం ఒక నినాదంగా, సూక్తిగా చెప్పబడుతుంది. ఈ మూడవ పాదాన్ని చెప్పడం వల్ల కవి ఒక కొత్త నినాదాన్ని సూక్తిని చెప్పినట్లవుతుంది. ఈ మొగ్గలను సెప్టెంబర్‌ 2017లో ప్రారంభించాను. 

ఈ మొగ్గలు మూడు పాదాల కవిత్వమే అయినప్పటికీ క్లుప్తత, సరళత, సంక్షిప్తత, గాఢత దీని ప్రధాన లక్షణాలు. మొగ్గలు కవిత్వానికి ఎలాంటి అక్షర నియమం కాని, ఛందస్సు కానీ లేదు. అందరూ సులభంగా రాసే కవితా ప్రక్రియ. ఈ మూడు పదాల కవిత్వాన్ని చక్కగా అభివ్యక్తీకరిస్తే మొగ్గలు తెలుగు సాహిత్యంలో నిలదొక్కుకునే అవకాశం ఉంటుంది.

ఇప్పటికే శతాధిక కవులకు పైగా మొగ్గలు ను నేటికీ ఆవిష్కరిస్తున్నారు. ఈ మొగ్గలు చినుకులా ప్రారంభమై నేటికీ వరదై పారుతున్నది. ప్రారంభించిన అనతికాలంలోనే అత్యంత వేగంగా ఈ మొగ్గలు నిత్యం విరబూస్తున్నాయి. కవుల ఆదరణతో పరిమళాన్ని వెదజల్లుతున్నాయి. వస్తు అనుకూలత, బలమైన శిల్పం, నూతన అభివ్యక్తి ఈ నూతనప్రక్రియకు ఆలంబన. ఈ మూడు అనుకూలతలే మొగ్గలు వికసించడానికి పాదుకలు. 

మూడు పాదాల్లోనే ఒక అంశాన్ని సంక్ష్తిప్తంగా, క్లుప్తంగా, గాఢంగా, సరళంగా చెప్పడం మొగ్గలు వికసించి విరబూయడానికి కారణం. ఏ కవితా ప్రక్రియనైనా వస్తువును బలంగా ఆవిష్కరిస్తేనే అది పదికాలాల పాటు నిలబడుతుంది. చెప్పే తీరును బట్టే కవిత్వం నిలుస్తుంది. పాఠకులను ఆకట్టుకుంటుంది. ఈ మొగ్గలు సులువైన ప్రక్రియ కావడంతో కవులు వైవిధ్యమైన అభివ్యక్తితో, విభిన్నమైన వస్తువులతో ఆవిష్కరిస్తున్నారు. ఇపుడిపుడే విచ్చుకుంటున్న మొగ్గలు కవితా ప్రక్రియను అనతికాలంలోనే శతాధికంగా కవులు ఆవిష్కరించడం మొగ్గలు సాధించిన విజయంగా చెప్పవచ్చు. ఒక చిన్న చినుకులా ప్రారంభమై వరదలా పారుతున్నది. నదిలా ప్రవహిస్తున్నది.

ఈ మొగ్గలు కవితా ప్రక్రియ శిల్పపరంగా, వస్తుపరంగా, భావపరంగా, అర్థవంతంగా, బలంగా ఆవిష్కరిస్తే తప్పక తెలుగు సాహిత్యంలో నిలదొక్కుకునే అవకాశముంటుంది. కవులు నూతన అభివ్యక్తితో మొగ్గలను ఆవిష్కరిస్తున్నారు. చక్కని శైలిలో పరిమళింపజేస్తున్నారు. కవులందరూ రోజుకొక కొత్త అంశాలతో మొగ్గలను విరబూయిస్తున్నారు. శతాధిక కవులందరూ శతాధిక మొగ్గలను ఆవిష్కరించారు. 

నీటి మొగ్గలు, పుస్తక మొగ్గలు, ప్రేమ మొగ్గలు, అమ్మ మొగ్గలు, నాన్న మొగ్గలు, పల్లె మొగ్గలు, రాత్రి మొగ్గలు, రైతు మొగ్గలు, జీవిత మొగ్గలు, సైనిక మొగ్గలు, చేనేత మొగ్గలు, తెలంగాణ మొగ్గలు, బాల్య మొగ్గలు, బడి మొగ్గలు, ప్రకృతి మొగ్గలు, ఇల్లు మొగ్గలు ఇలా వైవిధ్యమైన అంశాలతో కూడిన మొగ్గలు రోజూ విరబూస్తున్నాయి. 

ఒక మొగ్గను చూడండి...
''కొన్ని అక్షరాలు చాలు/ 
కవిత్వాన్ని ఆవిష్కరించడానికి/ 
అక్షరం రసాత్మక కావ్యం'' 

ఇందులో మొదటి రెండు పాదాలు కొనసాగింపుగా ఉన్నాయి. మూడవ పాదం ఆ రెండింటి పాదాలకు సమర్థింపు వాక్యంగా ఉంది. ఈ మొగ్గ సులువుగా, సరళంగానూ, సంక్షిప్తంగానూ చెప్పబడింది. కొన్ని అక్షరాలు చాలు కవిత్వాన్ని ఆవిష్కరించడానికి అనే పాదాలు సరళసుందరంగా చెప్పబడింది. దీనికి మూడవ పాదం అక్షరం రసాత్మక కావ్యం అనేది పై రెండు పాదాలను సమర్థించేదిగా ఆవిష్కరించబడింది. ఇక్కడ వస్తువు అక్షరం. అక్షరం యొక్క ప్రయోజనం ఈ మొగ్గలో సులువుగా చెప్పబడింది. మూడవపాదం ఇంతకుముందు చెప్పినట్లే అది ఒక నినాదంగా, సూక్తిగా కూడా ఆవిష్కరించబడుతుంది.

 మరొక మొగ్గను చూడండి....

''చినుకు స్నానమాడితేనే కానీ/
 ఆకు ముత్యాన్ని కిరీటంలా ధరించదు/ 
వాన చినుకు మెరిసే ముత్యం''

ఇక్కడ వస్తువు చినుకు. చినుకు ఆకుపై పడి స్నానమాడడమనేది కొత్త అభివ్యక్తి. ఆ చినుకును ఆకు ముత్యంలా ధరించడమనేది ప్రతీక. వానచినుకు ఆ ఆకుపై ఎలా ఉందంటే మెరిసే ముత్యంలా ఉంటుందనేది అర్థవంతమైన భావార్థం. ఇలా మొదటి రెండు పాదాలకు మూడవ పాదం బలంగా, అర్థవంతంగా ఆవిష్కరిస్తేనే  మొగ్గలు కవితా ప్రక్రియకు బలం చేకూరుతుంది.

ఏ కవితా ప్రక్రియ అయినా ఎక్కువ కాలం తెలుగు సాహిత్యంలో నిలదొక్కుకోవాలంటే ఆందులో బలమైన కవిత్వం వుండాలి. ఈ మూడు పాదాల మొగ్గలు ను కవులు ఆ దిశగానే చక్కగా, చిక్కగా, బలంగా, అర్థవంతంగా, భావయుక్తంగా ఆవిష్కరిస్తున్నారు. తమదైన శైలితో కొత్తదనపు అభివ్యక్తితో మొగ్గలను పరిమళింపజేస్తున్నారు. ఈ నూతన కవితా ప్రక్రియ మొగ్గలు ను కవులు, కవితాభిమానులు తప్పక ఆదరిస్తారని, అక్కున చేర్చుకుంటారని, గుండెలో నిలుపుకుంటారని మొగ్గలు ను తెలుగు సాహిత్యంలో కవితాగంధంగా వికసించడానికి అక్షర పరిమళాలను వెదజల్లుతారని ఆశిస్తున్నాను.

********************************
✍ ✍ 🌷 డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్
నవ తెలంగాణ :  దర్వాజ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి