అవును....!
కన్నీటికి భాష ఉంది
కనురెప్పల మాటున నిశ్శబ్దంగా దాగిన
కన్నీటికి ఎవరికీ తెలియని భాష ఉంది
చెంపపై జారే కన్నీటి బిందువు
అనంతబాధల భారపు సింధువు

అవును....!
కన్నీటికి ఒక భాష ఉంది
బతుకుసమరంలో ఘనీభవించిన కన్నీరు
కష్టాలకడలిని ఈదుటకు వంతెనవుతుంది
ఎదలోతుల్లో దాగిన నలుసు కలతలకు
గుండె భారాన్ని దించే లేపనమవుతుంది

మౌనంగా రోదిస్తూనే మనసును
ఊరడించే ఆపన్నహస్తమవుతుంది
ఎదలో ఎగిసిపడే ఆక్రందనలకు
కట్టలు తెగిన కాలువవుతుంది

అవును....!
కన్నీటికి భాష ఉంది
ఎన్నో అంతఃసంవేదనలను
మరెన్నో ఆవేదనస్రవంతులను
కడుపులో గుంభనంగా నింపుకుని
మౌనభావాలను ప్రకటిస్తుంది

బతుకు సెగలో మండే అగ్నిశిఖలా
ఎగిసే లావా పర్వతమవుతుంది
గుప్పెడు గుండెలో పొంగిపొరలి
ఆరనిగాయానికి ఆనవాలమవుతుంది

అవును...!
కన్నీటికి ఒక భాష ఉంది
విషాదాల మేఘం కమ్ముకున్నప్పుడల్లా
దుఃఖం జలపాతమై గుండెభారాన్ని దించుతుంది
భావోద్వేగాల వేదన ఆవరించినప్పుడల్లా
మనసు బాధలను మరిపించే నేస్తమవుతుంది

అవును...
జీవితం కనురెప్పల మాటున దాగిన
కన్నీరుకు మహా భాష ఉంది
బతుకుపోరులో వెన్నంటి ప్రవహించే
కన్నీటిసంధ్రానికి మనకు తెలియని భాష ఉంది
**********************************
✍ ✍ 🌷 డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ 🌷
🌷 📰 సూర్య : అక్షరం 📰🌷
🌷 06 ఆగస్టు 2018 : సోమవారం 🌷

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి