ఆలోచనలకు భావాలతో అంకురార్పణ చేస్తేనే కానీ
అక్షరాలు రసగంగకవితాప్రవాహాలై పరుగెడుతాయి
ఆలోచనలు మేధస్సుకు పూచిన పువ్వులు

ఉదయాలు సుప్రభాతగానాలను వినిపిస్తేనే కానీ
మట్టిమనుషులు వేకువను ముద్దాడే వెలుగవుతారు
ఉదయాలు కోడికూతల రాగాలకు ప్రతీకలు

కెరటాలు అలజడులతో పోరుసల్పితేనే కానీ
సాగరం గంభీరమైన తన అస్తిత్వాన్ని చాటుకోదు
కెరటాలు ఆటుపోట్లను భరించే నిర్ణిద్రగానాలు

కిరణాలు వెలుగుబాణాలను సంధింపజేస్తేనే కానీ
తిమిరం ఎప్పటికైనా ఓటమి అంచున నిలబడాల్సిందే
కిరణాలు అజ్ఞానాంధకారాన్ని తొలగించే దివిటీలు

మనిషి చీకటి బాధలను అనుభవిస్తేనే కానీ
వెలుగుతీపి రుచులను సదా ఆస్వాదించలేడు
జీవితమంటే చీకటివెలుగుల సంగమక్షేత్రం

*****************************************
✍ ✍డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్
📚📖 మాలిక పత్రిక  📖📚 సాహిత్య మాసపత్రిక 📚📖
 జూలై : 2018 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి