"తెలంగాణ ముత్తైదువ"
===============

సకలజనులు సల్లంగుండాలంటూ
సపరివారం చేసే పండుగ బోనం
ప్రకృతినే మాతగా ఆరాధించే
అరుదైన తెలంగాణ పండుగ బోనం

తెలంగాణంటే
బోనాల జాతరకు వేదిక
సంబరాలు అంబరాన్నంటే వేడుక
ఆడబిడ్డల బోనాల మొక్కులు
పోతురాజుల దశావతార విన్యాసాలు
శివసత్తుల వీరావేశ పూనకాలు
కళ్ళు చెదిరే డప్పుల దరువులు

ఘటాలతో ఎదుర్కోల ఉత్సవం
దేవతా పలుకుల భవిష్యవాణి
ఊరేగింపుతో సంబరాల వీడ్కోలు
ఆడబిడ్డల ఆనందాల సందడి
తెలంగాణకే ప్రత్యేకమైన పండుగ
మన  జాతర .... మన బోనం

బోనాల పండుగంటే
పుట్టింటికి వచ్చినంత సంబురం
ప్రతి ఇంటిని పలకరించే ఆత్మీయనేస్తం
ఏ ఇంటిని పలకరించినా 
బోనం ముత్తైదువై పలకరిస్తది
ప్రతి ఆడబిడ్డను ఆత్మీయంగా
సుమంగళియై దీవెనలిస్తది

బోనమంటే....
ఒక ఉత్సవం... ఒక ఉల్లాసం...
ఊరుఊరంతా కలిసి చేసే సంబరం
అందరిని ఒక్కటిగా చేసే ఏకతాస్వరం

బోనం...మా ఇంటి ఇలవేల్పు
            మా ఇంటి ఆడపడుచు
బోనమెత్తడమంటే
మన బతుకుల్ని మనమే వెలిగించుకోవడం
పచ్చగా మన బతుకులను పండించుకోవడం

బోనం పూనకమై ఊరేగిందా
ఊరు ఊరంతా జనజాతరే
బోనం రంగమై నాట్యం చేసిందా
పల్లెపల్లెంతా పసుపు తోరణాలే

బోనమంటే.... 
అనుబంధాలను పెంచే వారధి
ఆత్మీయులను కలిపే రథసారధి
బోనమంటే....
కష్టాలను మైమరపిస్తూనే
సంతోషాలను పంచే సల్లకుండ
జీవితం ఆనందంగా ఉండాలనే
బతుకుబండిని నడిపే రథచక్రం

ఆషాఢం మొదలైందా
తెలంగాణ పూనకమై ఊరేగుతది
ఆడపడుచులు పుట్టింటికి వస్తారా
బోనం పెయ్యంతా కళ్ళై ఎదురుచూస్తది

చరిత్ర ఎప్పటిదైనా
బోనం ఎప్పుడూ పచ్చబొట్టే
జీవితాలను పండించే నుదుటిబొట్టే

మైసమ్మ , పోశమ్మ , మాంకాళమ్మ
ఏ పేర్లతో పిలిచినా గ్రామదేవతలే
బోనాలతో సంతసించే పూనకాలే

తెలంగాణ సిగలో పూచిన 
బతుకుపువ్వులు బోనాలు
కులమతాలకు అతీతంగా
సందడి చేసే సబ్బండ బోనాలు

పోతురాజుల విన్యాసాలు
రంగం చెప్పే జాతకాలు
బోనాలకు నిండుదనాలు

బోనం మత్తడి దుంకిందా
ఊరంతా జనసంధ్రమే
జాతరలా ఊరేగిందా
ప్రతి మనిషి ఆనందపరవశమే

మనిషి బతకడం ఇవాళ
నిత్యం గగనమంత శోకం
గాయాలను మోస్తున్నంత భారం

యాడాదికోసారి ఊరికొస్తుందా
జాతరలా ఉప్పెనవుతుంది బోనం
గల్లిగల్లి తిరుగుతూ పలకరిస్తుందా
బతుకుపై ఆశలను రేకెత్తిస్తుంది

అవును....
బోనం మన పాలిట కల్పతరువు
మన బతుకులను బాగుచేసే ఆదరువు

బోనం....
తెలంగాణ నుదుటిన దిద్దిన కుంకుమతిలకం
జీవితాలను పచ్చగా పండించే పచ్చతోరణం
జీవితాలను వెలిగించే వెన్నెల సంతకం

**********************************
డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్
నేటినిజం : 19-07-2018 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి