నవ తెలంగాణ 02-04-2018 సోమవారం


మొట్టమొదటి కథా రచన పుట్టిందే తెలంగాణాలో. ప్రపంచ కథానిక సాహిత్యంలో మొట్టమొదటి కథకుడు గుణాడ్యుడు. అతని రచన బృహత్కథ. ఇందులోనివన్నీ కథలే. 
1902లో ఆధునిక తెలంగాణ కథా సాహిత్యం భండారు అచ్చమాంబతో ప్రారంభమైంది. ఈమె రాసిన కథ ''స్త్రీ విద్య'' తొలి తెలంగాణ కథగా చెప్పవచ్చు. భండారు అచ్చమాంబ అనంతరం మాడపాటి హనుమంతరావు, నెల్లూరి కేశవస్వామి, బండారు శ్రీనివాసశర్మ, షబ్నవీస్‌ వెంకట రామనరసింహ్మారావు, సురవరం ప్రతాపరెడ్డి తదితరులు కథా సృజనకు శ్రీకారం చుట్టారు.
ఆ వరుసలోనే మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ఎదిరె చెన్నకేశవులు అనేక కథలను రచించాడు. 1951లో తొలికథను చెన్నకేశవులు రచించాడు. అనంతరం తాను రాసిన అన్ని కథలను కలిపి 1968లో ''పొట్ట కోసం'' అనే కథా సంపుటిని వెలువరించాడు. 1918లో మహబూబ్‌నగర్‌లో జన్మించిన ఎదిరె చెన్నకేశవులు మొదటగా ఒక పత్రికకు విలేకరిగా పనిచేశాడు. అనంతరం ''గోల్కొండ పత్రిక'' లో విలేకరిగా, సహసంపాదకుడిగా పనిచేశాడు. ఆ తర్వాత ''నేత'' పత్రికను సంపాదకుడిగా వ్యవహరించాడు. అంతేకాదు చేనేత సహకార సంఘం ఆధ్వర్యంలో వెలువడే ''సహకార సమాచారం'' అనే పత్రికకు కూడా సహసంపాదకుడిగా వ్యవహరించాడు.
ఎదిరె చెన్నకేశవులు బహుముఖ రచనాద్రష్ట. కవిగా, కథా రచయితగా, నవలాకారుడిగా, గేయరచయితగా, జర్నలిస్టుగా, సంపాదకుడిగా,అనువాదకుడిగా, బహుముఖ పాత్ర పోషించిన రచయిత. తెలంగాణ తొలితరం కథకుల్లో ప్రముఖంగా పేర్కొనదగినవాడు ఎదిరె చెన్నకేశవులు. ఇతని కథలు అనేక వారపత్రికల్లో ముద్రితమయ్యాయి. ఇతని మొదటి కథ ''అభ్యుదయ రచయిత'' సుజాత పత్రికలో 1950లో తొలిసారిగా అచ్చయింది. ఆ తర్వాత రాసిన కథలన్నింటిని కలిపి ''పొట్టకోసం'' అనే కథా సంపుటిని 1968లో వెలువరించాడు. ఇందులో పర్యవసానం, కూలి వెంకన్న, ప్రతిఫలం, పొట్టకోసం, సహవాసం, ఉగాది, కార్మికులదే గెలుపు, నీకోసం, గుణపాఠం వంటి కథలున్నాయి. 
పొట్టకోసం కథా సంపుటిలో మొదటి కథ పర్యవసానం. ఈ కథలో రూప అనే అమ్మాయి డ్రామా ఆర్టిస్టుగా, ప్లేబ్యాక్‌ గాయకురాలిగా పనిచేస్తుంది. చంద్రహాసన్‌ అనే మేకప్‌మెన్‌ ఆమెను లోబర్చుకోవాలని అనుకుంటాడు. కానీ ఆమె చంద్రహాసన్‌ను తిరస్కరిస్తుంది. దీంతో చంద్రహాసన్‌ రూపపై పగ సాధించడానికి ఆమెను పతిత అని దుష్ప్రచారం చేస్తాడు. చంద్రహాసన్‌ ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్నిసార్లు అవమానించినా వాటినన్నింటిని తట్టుకొని రూప ప్రేమించినవాడిని చివరికి పెళ్ళి చేసుకొంటుంది. ఈ కథలో రూప పాత్రను రచయిత తెలిసీ తెలియని వారితో స్నేహం చేస్తే దాని పర్యవసానం ఎలా ఉంటుందో చక్కగా చిత్రించాడు.
రెండవ కథ కూలీ వెంకన్న. ఈ కథలో మేస్త్రీలు కూలీలను ఎంత హింసకు గురిచేసి స్త్రీలను ఎలా పాడు చేస్తారో ఇందులో రచయిత సహజసిద్ధంగా రచించాడు. కూలీ వెంకన్న పాత్ర ద్వారా కూలీల జీవన స్థితిని చిత్రించాడు. ఇందులోని లక్ష్మి పాత్ర ద్వారా ఆడకూలీల దయనీయమైన జీవనాన్ని మన కళ్ళకు కట్టించాడు. ఈ కథలో వెంకన్న పాత్ర ద్వారా కూలీల జీవనస్థితిని కథలోని సంభాషణలో వివరించాడు. ఈ పాడులోకంలో కూలీ చేసుకొని బ్రతికేవారికి గౌరవమే లేదనీ, ధనంతోనే బీదల మానమర్యాదలను పెద్దలు కొల్లగొట్టుతారని, అందుకే కూలీలకు ప్రపంచంలో తావు లేదు, సుఖము లేదనీ, ఎప్పటికీ కష్టజీవులై కాలం గడుపుతుంటారనే వాస్తవాన్ని చెప్పాడు. ఇప్పటికీ పాలమూరు జిల్లాలో వలసలు నిత్యకృత్యంగా సాగుతూనే ఉన్నాయి. ఆ వలస జీవితంలోని అనేక ఒడిదుడుకులను, కూలీల బాధలను ఈ కథలో రచయిత చక్కగా ఆవిష్కరించాడు. 
మూడవ కథ ప్రతిఫలం.ఈ కథలో డబ్బుతో దేవున్ని పూజించడం కన్న సమాజహిత కార్యక్రమాలకు ఆ డబ్బును ఉపయోగించడం మంచిదన్న విషయాన్ని తెలిపాడు. సమాజంలో దేవున్ని పూజించడమనేది నిత్యకృత్యమైన విషయం. అయితే స్వయంకృషి లేకుండా దేవునిమీదనే భారం వేయడమనేది సోమరిపోతుల లక్షణం.అంతేకాదు డబ్బు ఉన్నవాళ్ళు కూడా దేవునిమీదే భారం వేసి కాలం వెళ్ళదీస్తున్నారు. అంతేకాదు దేవుని హుండీలో డబ్బులు వేస్తున్నారు. అయితే డబ్బులు దేవుని హుండీలో కాకుండా సమాజంకోసం వెచ్చిస్తే ప్రయోజనం ఉంటుందన్న సందేశాన్ని ఈ కథ ద్వారా రచయిత కండ్లకట్టాడు. అభ్యుదయవాదంతో కూడిన కథ ఇది. 
నాల్గవ కథ పొట్టకోసం. ఈ కథలో ప్రపంచంలో పొట్ట కోసం వేశ్యలు ఏయే పాట్లు పడతారో యమున పాత్ర ద్వారా చక్కగా చిత్రించాడు. వేశ్యల జీవనవిధానాన్ని కళ్ళకు కట్టినట్లు రచయిత చూపించాడు. వేశ్యాగృహాలలో ఉండే వాతావరణాన్ని సహజసిద్ధంగా చిత్రించిన కథ ఇది.
ఐదవ కథ సహవాసం. మంచి, చెడు సహవాసాల వల్ల ఎలాంటి పరిణామాలుంటాయో ఈ కథ ద్వారా రచయిత తెలిపాడు. ఇందులో మంచి సహవాసం వల్ల జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందో లలిత, శ్యామల పాత్రల ద్వారా చూపించాడు. చెడు సహవాసం వల్ల కలిగే అనర్థాలను లీల పాత్ర ద్వారా చిత్రించాడు. గొప్ప స్నేహితురాళ్ళ కథ ఇది. స్నేహం విలువను చాటిన కథనమిది. సమాజంలో మంచి చెడుల విలువలను తెలుసుకొని మసలుకోవాలనే సందేశాన్ని రచయిత ఈ కథలో చెప్పాడు.
ఆరవ కథ కార్మికులదే ఈ గెలుపు. ఈ కథలో కార్మికుల జీవనవ్యధలను ఆవిష్కరించాడు.  ఐకమత్యంతో కార్మికులందరూ ఉంటే ఎలాంటి విజయాన్నైనా సాధించవచ్చనే సందేశమిచ్చిన కథ ఇది. కర్మాగారాలలో కార్మికుల సమస్యలు నిత్యకృత్యం. అలాంటి కార్మికులు ఎదుర్కొనే పలు సమస్యలను ఈ కథ చిత్రించింది. యాజమాన్యం పెట్టె అనేక బాధలను ఓర్చుకొని కార్మికులు తమ జీవితాలను ఎలా నెట్టుకొస్తున్నారో రచయిత చక్కగా వివరించాడు.
ఏడవ కథ గుణపాఠం. ఈ కథలో మేరి పాత్ర ద్వారా స్త్రీలు సౌందర్యం కోసం వెచ్చించే డబ్బునంతా పొదుపు చేస్తే సుఖవంతమైన జీవితం ఎలా గడపవచ్చనే అంశాన్ని చాలా సున్నితంగా తెలిపాడు. భవిష్యత్తును దూరదృష్టితోనే ఊహించిన రచయిత ఈ కథను చెప్పడం విశేషం.
ఎనిమిదవ కథ మొదటి తేది. ఇందులో ప్రతీ ఉద్యోగికి మొదటి తేది వస్తుందనగానే ఒక దిక్కునుండి ఆశ, రెండవ దిక్కునుంచి నిరాశ ఆవహిస్తుంది. ఆశ ఎందుకంటే నెలరోజులు చమటోడ్చి శ్రమ చేసిన దానికి ప్రతిఫలంగా డబ్బు లభిస్తుంది. అది తన కుటుంబపోషణానికి సరిపోని, సరిపోకపోనీ తనకు ఆనాడు అందితే చాలు. ఉద్యోగి ఆనందానికి అంతే ఉండదు. మరుసటి రోజు కలిగే ఆర్థిక చిక్కులకు తట్టుకోలేక ఎందుకీ మొదటి తేదీ వచ్చిందిరా దేవుడా! అని నిరాశతో వాపోతాడు ప్రతి ఉద్యోగి. ఈ కథలో ప్రదీప్‌ పాత్ర ద్వారా అద్భుతంగా చిత్రించాడు. ఈ కథను ఎదిరె చెన్నకేశవులు అతి సహజాతి సహజంగా రచించడం విశేషం. 
చెన్నకేశవులు కథలన్నీ మధ్యతరగతి జీవితాల గురించి రాసినవే. వలస జీవితం, వేశ్యవృత్తి, చెడు స్నేహం, కార్మికుల జీవితం, సంఘసంస్కరణవాదం, అభ్యుదయవాదం గురించి తన రచనల్లో ప్రముఖంగా పేర్కొన్నాడు. రాసిన ప్రతి కథ ఒక సామాజిక అంశాన్ని లేవనెత్తిందే. విభిన్న కోణాలతో ఆవిష్కరించినదే. ఆనాటి సమాజంలో వేళ్ళూనుకున్న అనేక సమస్యలను చెన్నకేశవులు కథలుగా మలిచాడు. నేటికీ ఇవి ప్రాసంగికత కలవే కావడం విశేషం. కారణం ఇందులోని వస్తువులు కొత్తదనంతో ఉండడమే. కథల్లోని భాష, వర్ణనలు నేటికీ చక్కగా చదివిస్తాయి. వ్యవహారికంలో రాసిన ఈ కథలన్నీ వైవిధ్య పూరితమైనవే. రచయిత ప్రతి పాత్రను చక్కగా మలిచి పూర్ణత్వాన్ని సిద్ధింపజేశాడు. పాత్రల మనస్తత్వాన్ని చక్కగా చిత్రించాడు. కళ్ళముందు జరుగుతున్న వాస్తవ సంఘటనలనే వస్తువులుగా తీసుకొని రచయిత కథలు రాసినప్పుటికీ అవి ఇంకా సజీవంగా ఉండడం గమనార్హం. ఊహాజనిత ఇతివృత్తాలను తీసుకోకుండా వాస్తవ జనిత ఇతివృత్తాలను తీసుకుని కథలను ఎన్నుకోవడం రచయిత దీర్ఘదృష్టికి నిదర్శనం.
తెలంగాణలో తొలిదశలోనే కాల్పనికతకు దూరంగా ఉండే కథలు వెలువడ్డాయి. సంఘసంస్కరణే ప్రధానంగా సాగిన రచనలు అభ్యుదయవాదాన్ని ఆకాంక్షించాయి. వాస్తవాన్ని చిత్రించే కథలు ఎక్కువగా వచ్చాయి. కారణం అప్పటి సమాజ పరిస్థితులు. ఎదిరె చెన్నకేశవులు కంటే ముందు రాసిన కథరాచయితలు కూడా సంఘ సంస్కరణాభిలాషతోనే రచనలు చేశారు. ఏ కథారచన అయినా సమాజ మార్పుకోసమే. తెలంగాణలోని ప్రజా జీవితాన్ని చిత్రించే కథలు చాలా వచ్చాయి. తొలితరం కథారచయితలు రాసిన కథలన్నీ అవే కావడం గమనించాల్సిన విషయం. శ్రమదోపిడి, తిరుగుబాటు, అన్యాయాలను, దోపిడీలను చిత్రిస్తూ చేసిన రచనలు చాలా వచ్చాయి. 
అయితే ఎదిరె చెన్నకేశవులు రాసిన చాలా కథల్లో మానవతావాదం ధ్వనిస్తుంది. అభ్యుదయ ఆకాంక్ష కనబడుతుంది. తెలంగాణ భాషా పరిమళం ఎలా ఉంటుందో రచయిత కథలను చదివితే అర్థమవుతుంది. తెలంగాణ భాషది ఒక ప్రత్యేకగుణం. రచయిత కథల్లో వర్ణనలు, సామెతలు, జాతీయాలు, పలుకుబడులు చాలా కన్పిస్తాయి. మనదైన సాంస్కృతికతను రచయిత ఆనాడే తన కథల్లో చొప్పించడం విశేషం. మన భాషకు మనం దూరమవుతున్న తరుణంలో ఆనాటి కథలు నిజంగా తెలంగాణ భాషకు పట్టం కట్టినవే. తెలంగాణ భాషకు జీవం పోసి సుస్థిరస్థానాన్ని కల్పించింది ఆనాటి కథకులేననడం అత్యుక్తి కాదు.

డా|| భీంపల్లి శ్రీకాంత్‌, 9032844017

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి