రుబాయిలు

గణేష్ దినపత్రిక 10-04-2018

కన్నీళ్ళను దాటుకుంటూ సంసారాన్ని మోస్తాను
కడలి కెరటాలను ఆదర్శంగా తీసుకుంటాను
కన్నీరే జీవితాన్ని స్వాంతనపరిచేది ఎప్పుడూ
బాధల బరువులతోనే బతుకును సాగిస్తాను

కష్టసుఖాలుంటేనే జీవితాన బతుకంటే
అలజడులుంటేనే ఆటుపోట్ల కడలంటే
చీకటివెలుతురులే జీవితంలో ఎప్పుడూ
కలిమిలేములుంటేనే బతుకు సాగడమంటే

జాబిల్లిన్నడుగుతాను చలువపందిరేయమని
సూర్యుడిన్నడుగుతాను వెచ్చనికౌగిలీయమని
రాత్రిపగలు జోడుగుర్రాలే కాలానికి ఎప్పుడూ
సాగరాన్నడుగుతాను తీరానికి చేర్చమని

ఎన్నెన్నో ముసుగులు కనపడని మనిషిలో
ఎన్నెన్నో ముసురులు అలుముకున్న చీకటిలో
కుట్రలుకుతంత్రాలే బతుకుదారిలో ఎప్పుడూ
ఎన్నెన్నో మాయలు కనిపించని గమనంలో

కనిపించని మానవతను కాగడాతో వెతుకుతాను
అగుపించని సమానతను దివిటితో పహారాకాస్తాను
సమతమమతలే మానవాళికి ఆదర్శం ఎప్పుడూ
అడుగడుగున దానవతను కలంతో తరుముతాను

✍✍ డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి