రాత్రి సూర్యుడు 

గణేష్ దినపత్రిక 07-04-2018


అతడికి
పగలు ... రాత్రి
రాత్రి ... పగలు

ప్రపంచమంతా పరుగెత్తుతున్నప్పుడల్లా
వాడు తనదైన లోకంలో విహరిస్తూనే ఉంటడు
లోకమంతా అలసిపోయి నిద్రపోయినప్పుడల్లా
అతడు రాత్రి సూర్యుడై వెలుగుతూనే ఉంటడు

అతడు నిత్యం పహారా కాస్తున్న రాత్రిలా
రహదారులను శుభ్రం చేస్తూనే ఉంటడు
మానవసేవనే మాధవసేవనంటూ
మానవాళి శ్రేయస్సుకై పరితపిస్తూనే ఉంటడు
నిత్యం మురికికూపంలో దిగబడుతూనే
మన మురికిని వదిలిస్తుంటడు

కడుపుకు తిండిలేకున్నా...కంటికి నిద్రలేకున్నా
రోజూ మహాశివరాత్రిలా...నిత్యజాగరణ చేస్తూ
ప్రతినిత్యం లోకాన్ని శుభ్రపరుస్తూనే ఉంటడు
వాడి ఆకలిని ఈ లోకం పట్టించుకోదు
అతడి దాహాన్ని ఈ ప్రపంచం తీర్చదు

అతడి పని వాడిదే...
తను నిత్యం కొత్త ప్రపంచానికై
బాటలు వేస్తూనే ఉంటడు
రాత్రి మేల్కొంటూనే 
లోకాన్ని నిద్రలోకి దించేస్తుంటడు

పొద్దు నేలను ముద్దాడేదాక
తనువును విల్లులా వంచి 
ఊపిరి సలపనంతగా పనిచేస్తుంటడు

తన రెక్కలను ముక్కలుగా మార్చినా
అతడికింత జనాదరణ ఉండదు
తన కష్టాన్ని లోకానికి ఆహుతి చేసినా
అతడి కడుపుకింత ఆకలి తీరదు

అతడు...రాత్రి సూర్యుడు
పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడిలా
చీకటితో యుద్ధం చేస్తూనే ఉంటడు
రాత్రి మిత్రుడితో చెలిమి చేస్తూనే
నిత్యం వేగుచుక్కై వెలుగుతుంటడు

మనం వెన్నెలై వెలుగుతున్నమంటే
అతడు లోకాన్ని నిత్యం శుభ్రం చేస్తున్నందుకే 
మనం మనుషులమై తిరుగుతున్నమంటే
అతడు రాత్రిసూర్యుడై పహారా కాస్తున్నందుకే

✍⚘డాక్టర్  భీంపల్లి శ్రీకాంత్ 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి