కళ తప్పిన పల్లె

గణేష్ దినపత్రిక 09-04-2018

పల్లె అంటే
                         ఒకప్పుడు మల్లె మనసుల                            మమతల మాగాణం
ఇప్పుడు
కళ తప్పిన శ్మశానం

పల్లె అంటే 
పండుగలు పబ్బాలేనా...
యక్షగానాల హరివిల్లు
బోగమోల్ల నాటకాలు
భజనల ఆనవాళ్లు
కోలాటాల కోలాహలం
జాతరల ఉత్సాహం
బొడ్డెమ్మల ఆటలు
బతుకమ్మల పాటలు

ఇప్పుడు పల్లె
ఎండిన చెరువయ్యింది
బీడువడిన పొలమయ్యింది

ఒకప్పుడు పల్లె అంటే
నాటకాల సమూహం
నవరసాల సమ్మేళనం
ప్రతి మనిషి
పాలనురుగై ప్రవహించేవాడు
                       మమతల మల్లెను అల్లేవాడు                           
ఇప్పుడు పల్లె అంటే
ముగిసిపోయిన నాటకం
శిథిలమైన సంస్కృతి

జీవితం...
నాటకరంగమైనపుడు
ఒక్కో మనిషి
నవరసాలను ఒలికించే
సృజనాత్మక చైతన్యం
ఎన్నో కళలను ప్రదర్శించే 
కళాత్మక చేతనం

మనిషి....
ఇప్పుడు కళ తప్పిండు
అందుకే అన్ని వేషాలు
నాటకాల్లోనే ...
అన్ని పాత్రలు... 
జీవితంలోనూ...!

ఎన్ని రంగులు మారిస్తేనేం
నాటకం గుడ్డిదైపోతుందా?
ఎన్ని నాటకాలు వేస్తేనేం
జీవితం రంగు మారిపోతుందా?

నాటకం... 
రంగు వెలిసిన జెండేమి కాదు
మహా జీవితానికి ఒక కాగడా!

నాటకం...
అంతరించేది ఏమి కాదు
మనిషి ఉన్నంతవరకు దాని మనుగడ!!

జీవితమంటే నాటకమే...
నాటకమంటే జీవితమే !

✍⚘ డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి