వసంతం వాలని ప్రకృతిలా
బోసిపోయిన ఇల్లు
అలజడులు లేని సముద్రంలా
మూగబోయిన ఇల్లు

నిత్యం సందడి చేసే సీతాకోకచిలుకలు
వేసవిస్వప్నాన్ని కంటూ వలసపోయాయి

ఇల్లు పూలతోటలా కళకళలాడిందంటే
పసిమొగ్గల పరిమళాల గుభాళింపులతోనే

ఇంట్లో నవ్వులు హరివిల్లులా విరిసాయంటే
అల్లరి జలపాతాల అనంతసవ్వడులతోనే

ముద్దులొలికే మాటలు మురిపించాయంటే
బాలబ్రహ్మల మధురమైన వేదవాక్కులతోనే

నిత్యం కేరింతలతో నిద్రలేచే ఇల్లు
ఇవాళ ఒంటరిపక్షిలా మూగబోయింది

రోజూ కొత్తప్రపంచమై ఉదయించే ఇల్లు
ఈరోజు శూన్యావరణాన్ని కప్పుకొంది

రోజూ వెన్నెలవెలుగులను పంచే ఇల్లు
ఇవాళ అమావాస్య చీకటిని తలపిస్తుంది

వాళ్ళు ఉంటేనే ఇల్లు నందనవనమై
అందమైన పూలతోటలా పుష్పించేది

వేసవికాలంలో సరదాకై వాళ్ళు
బోసిపోయిన ఇల్లులా మేము

✍✍ డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ 
నవ్య మీడియా 15-04-2018 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి