*మొగ్గలు*
గణేష్ దినపత్రి 01-02-2018

అతడు దివ్యాంగుడు అయితేనేం
అవనిలో ఏలే రాజవుతున్నాడు
ఆత్మవిశ్వాసం అతని వజ్రాయుధం

అతడు అసమానతల సమాజంలో
సమానతకై పోరు సలుపుతున్నాడు 
సమానత్వం అతని ఆశయకిరణం

అతడు అంధత్వంలో కొట్టుమిట్టాడుతూనే
అవిటివాడై ఒంటరిగా జీవిస్తున్నాడు
హరివిల్లు అతని తీరని కోరిక

అతడు వెలుగుకై పరితపిస్తూనే
బతుకు చీకటితో యుద్ధం చేస్తున్నాడు
గుండెధైర్యం అతని సంకల్పబలం

అతడు విత్తనమై మొలకెత్తుతూనే
ఎదిగే వృక్షమై నీడను కంటున్నాడు
అచంచలం అతని ఆత్మవిశ్వాసం

అతడు చీకటిజగతిలో పయనిస్తూనే
వెలుగురేఖయై ప్రసరించాలనుకుంటున్నాడు
దినదినగండం అతని మూడవనేత్రం

అతడు ఉషోదయంకై వేచిచూస్తూనే
జీవిత ప్రయాణాన్ని సాగిస్తున్నాడు
వెలుగు కోసం అతని ఆరాటం

అతడు వెక్కిరింతలను భరిస్తూనే
నూతన సమాజాన్ని స్వప్నిస్తున్నాడు
జ్ఞాననేత్రం అతని అస్తిత్వకేతనం

అతడు సజీవనదియై ప్రవహిస్తూనే
కొత్త దారులను వెతుక్కుంటున్నాడు
నవలోకసృష్టి అతని ప్రాణవాయువు

అతడు జ్ఞానజ్యోతియై ప్రకాశిస్తూనే
జగతికి విజ్ఞానాన్ని పంచుతున్నాడు
ప్రతిభ అతని ఆరోప్రాణం          

 *భీంపల్లి శ్రీకాంత్*
01-02-2018


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి