*మొగ్గలు*

 గణేష్ దినపత్రి 04-02-2018
నది ఎన్ని పాదముద్రలను రుచిచూసిందో
ప్రతి అడుగుజాడను భవిష్యత్తుకై లిఖించింది
నది రేపటి చరిత్రకు నాందీవాక్యం

సముద్రం ఎన్ని ఆటుపోట్లను తట్టుకున్నదో
నిత్యం అలల అలజడులతో నిద్రపోతూనే ఉంటుంది
సముద్రం జీవితాన్ని నేర్పే పచ్చని పాఠం

చెరువు ఎన్ని కాలాలను కళ్ళారా చూసిందో
నిత్యం వానచినుకులకై ఎదురుచూస్తూనే ఉంటుంది
చెరువు ఊరంతటికీ బతుకునిచ్చే కల్పతరువు

వాగు ఎన్ని కాలువలను పంటలకు పారించిందో
నిత్యం బీడుపొలాలకు ఆసరా అవుతూనే ఉంటుంది
వాగు రైతన్నను అక్కున చేర్చుకునే స్నేహహస్తం

కాలువ ఎన్ని పంటలను సస్యశ్యామలం చేసిందో
నిత్యం పంట దాహార్తిని తీరుస్తూనే ఉంటుంది
కాలువ రైతుకన్నీటిని తుడిచే ఆపన్నహస్తం


  *భీంపల్లి శ్రీకాంత్*

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి