*భాష మొగ్గలు*


మౌనానికి మాటలు నేర్పించినప్పుడల్లా
అది అనుభవాలపేటికను పేరుస్తూనే ఉంటుంది
ఎదలోని భావాలకు వారధి మాతృభాష

మదిలోని అనుభూతులను చిలికినప్పుడల్లా
అనుభవం అమృతాన్ని పంచుతూనే ఉంటుంది
కమ్మనైన భాష మన తీయని తెలుగుభాష

మనిషి సుగంధమై పరిమళించినప్పుడల్లా
మంచిమాట ఆణిముత్యమై మెరుస్తూనే ఉంటుంది
భావాలకు ప్రాణవాయువు మన మాతృభాష

అనుభవాల జ్యోతులను వెలిగించినప్పుడల్లా
అజ్ఞానాంధకారం తొలిగిపోతూనే ఉంటుంది
విజ్ఞాన వికాసానికి విత్తు మన మాతృభాష

గుండెలనిండా భావాలు పొంగినప్పుడల్లా
భాష మణిదీపమై వెలుగుతూనే ఉంటుంది
మమత పంచు తెలుగు మన మాతృభాష

(అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ సందర్భంగా)


 *భీంపల్లి శ్రీకాంత్*

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి