* మొగ్గలు *
''స్వర్ణపుష్పం'' మాసపత్రిక ఫిబ్రవరి 2018

రివ్వున ఎగిరిపోయే పక్షులకు తెలుసు
దారిలేని గమనానికి పయనం ఎంతో
విహంగం ఒక స్వేచ్ఛా వాయులీనం

నిత్యం అడుగులేసే పాదాలకు తెలుసు
గమ్యాన్ని చేర్చే ఆగమనం ఇంకెంతో
చివరి మజిలీ ఒక అంతిమవిజయం

సాగరాన పడిలేచే కెరటాలకు తెలుసు
ఆటుపోట్ల అలజడుల అలసట ఎంతో
కెరటం అనంతకల్లోల దుఃఖసముద్రం

చెక్కిలిపై జారిపడే కన్నీటికి తెలుసు
గాయపడిన గుండెల్లోని బాధల బరువెంతో
జీవితం దుఃఖాన్ని ఒంపుకునే కన్నీటిజలపాతం

కవితాలతలు అల్లే అక్షరపూలకు తెలుసు
పరిమళించే సాహిత్యం సమాజానికెంతో
కవిత్వం సమాజాన ప్రకాశించే మణిరత్నం

  *భీంపల్లి శ్రీకాంత్*

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి