నమస్తే తెలంగాణ 06-05-2018 ఆదివారం 
ఉమ్మడి పాలమూరు జిల్లాకు సాగు, తాగునీరు అందుతున్న సందర్భంలో వనపర్తి జిల్లా కేంద్రంలోనేడు రాష్ట్రస్థాయి జల కవితోత్సవం జరుగుతున్నది. నీటి ప్రాముఖ్యాన్ని తెలిపే వచన, పద్య, గేయ, కవితా రూపాల్లో కవులు తమ రచనలను వినిపించనున్నారు. వచ్చిన కవితలన్నింటినీ పుస్తకరూపంలో వెలువరుస్తాం. ఈ కవి సమ్మేళనానికి రాష్ట్రంలోని 31 జిల్లాల నుంచి కవులను ఆహ్వానిస్తున్నాం.

జలవనరులు పుష్కలంగా ఉన్నా, వాటిని సద్వినియోగపరుచని కారణంగానే పాలమూరు వలసలకు నిలయమైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం చేపట్టిన ప్రథమ ప్రాధాన్యాలలో నీటి పారుదల ఒకటి. పాలమూరు వలస జిల్లానే కాదు, పచ్చని పైరుల ఖిల్లా అని నిరూపించే సమయం ప్రారంభమైంది.ఒకప్పుడు బీడు భూములు ఇప్పుడు పచ్చని పంటలతో స్వాగతిస్తున్నాయి. వట్టిపోయిన చెరువులు ఇప్పుడు అలుగులు దుంకుతూ పొలాలను అభిషేకం చేస్తున్నాయి. ఒకనాడు ఏడాదికోసారి లేని పంట ఇప్పుడు రెండు పంటలతో రైతింట పసిడి కురిపిస్తున్నది. అన్నదాతకు ఆయువుపోస్తూ జలవనరులు మన ముంగిట జాలువారుతున్నాయి. అందుకు ప్రత్యక్ష ఉదాహరణలు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని చెరువు లు నిండటమే. సాగునీరు లేక ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన ప్రజలు ఇప్పుడు తిరిగి తమ సొంత గూళ్లకు చేరుకుంటున్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పథకాల ద్వారా ప్రజలకు నీరు చేరువవుతున్నది. గత పాలకుల నిర్లక్ష్యాల వల్ల చెరువులు, కాలువలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. తెలంగాణ ప్రభు త్వం వచ్చిన తర్వాత వాటి పునరుద్ధరణకు అంకితభావంతో పనిచేయడంతో చెరువులు, కాలువలిప్పుడు జలకళతో ఉట్టిపడుతున్నాయి. పల్లె ప్రజలు ఆనందంగా వ్యవసాయం చేసుకుంటున్నారు. తెలంగాణ కోటి ఎకరాల మాగాణిలా సాకారమయ్యేందుకు అహర్నిశలు ప్రాజెక్టు పనులు జరుగుతున్న పాలమూరు లో కృష్ణమ్మ పరుగులతో దక్షిణ తెలంగాణ ధాన్యాగారంగా త్వరలోనే మారనున్నది.

ఒకప్పుడు.. పాలమూరు జిల్లా అనగానే కరువు జిల్లా, వలసల జిల్లా అనే పేరుండేది. బీడు పొలాలతో దర్శనమిచ్చేది. కరు వు చేసిన గ్రామానికి పాలమూరు జిల్లా ఏండ్లుగా అతలాకుతలమైంది. వలసల ఖిల్లాగా మారిపోయింది. సమైక్య రాష్ట్రంలో పాలమూరు జిల్లా దుర్భిక్ష పరిస్థితి ఇది. అది గతం. ఇప్పుడు స్వరాష్ట్ర పాలనలో పాలమూరు పచ్చని పంటలకు నెలవైంది. ఎండిన బీడు పొలాలు నవ్వుతున్నాయి. జలాలు కళకళలాడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చినంక పాలమూరు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులకు మోక్షం లభించింది. కొత్త ప్రాజెక్టులకు రూపకల్పన జరిగింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టింది.

మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పాలమూరు జిల్లాకంతటికీ సాగు నీరందించే అతిపెద్ద ఎత్తిపోతల పథకం. ఈ ఎత్తిపోతల పథకం పనులు జోరుగా సాగుతున్నయి. ఈ పథకం ద్వారా ఎల్లూరు, జొన్నలబొగడ, గుడిపల్లి లిఫ్ట్ పనులు పూర్త యి వివిధ గ్రామాలకు తాగు, సాగు నీరు అందిస్తున్నవి. తెలంగాణ ప్రభుత్వం వచ్చేంతవరకు ఈ పథకాలన్నీ పడావు పడి ఉన్నాయి. ఇప్పుడు నీళ్ళతో కళకళలాడుతూ కాల్వల ద్వారా పం ట పొలాలకు సాగునీటిని అందిస్తున్నవి.

ఉమ్మడి రాష్ట్రంలో అత్యంత ఎక్కువగా నష్టపోయిన జిల్లా పాలమూరు. ఇక్కడ అన్ని వనరులున్నా పాలకుల నిర్లక్ష్యానికి గురైంది. నష్టపోయిన ఉమ్మడి పాలమూరు జిల్లాకు తెలంగాణ రాష్ట్రంలో న్యాయం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు శ్రీకారం చుట్టారు. ఈ పథకం పూర్తయితే పాలమూరు జిల్లా పూర్తిగా సస్యశ్యామలం అవుతుంది.

తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదిలోనే పెండింగ్ ప్రాజెక్టుల పనులను పూర్తిచేసి రెండో ఏడాదే ఉమ్మడి జిల్లాలో చెరువులు నింపి రైతులకు సాగునీరును అందించింది. అదీ తెలంగాణ ప్రభుత్వ ఘనత. తెలంగాణ ప్రభుత్వం సాగునీటి రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేస్తున్నది. ప్రతి చెరువును ఎత్తిపోతల పథకాలతో నింపుతున్నది. చెరువులు నిండితేనే రైతన్నలకు పండుగ. రైతన్నలు నవ్వితేనే ప్రజలకు నిత్య పండుగ. ఆ దిశగానే తెలంగాణ ప్రభుత్వం సాగునీటి రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నది.

మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో వనపర్తి నియోజకవర్గానికి ఎలాంటి కేటాయింపులు లేకపోవడం గమనార్హం. అయితే ఎలాగైనా వనపర్తి నియోజకవర్గానికి ఈ పథకం ద్వారా కేటాయింపులు జరుపాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి నిర్ణయించి ఆ మేరకు పట్టు వదలని విక్రమార్కుడిలా సాధించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో బుద్ధారం, ఖిల్లా గణపురం, పెద్దమందడి బ్రాంచ్ కెనాల్‌లతో వనపర్తి సస్యశ్యామలం కానున్నది. 119 కోట్లతో ఖిల్లా గణపురం కెనాల్ 11 నెలల్లోనే పూర్తయి చరిత్ర సృష్టించిం ది. 30 ఏండ్ల తర్వాత గణప సముద్రం నీళ్ళతో కళకళలాడుతున్నది. అలుగు దుంకుతున్నది. 25 కోట్లతో 24 కిలోమీటర్ల పెద్దమందడి బ్రాంచ్ కెనాల్ ముందుకు సాగుతున్నది.
2014లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడేంతవరకు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద వనపర్తి నియోజకవర్గానికి సాగునీరందించే కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 25 టీఎంసీల కేటాయింపులే ఉండేది. నిరంజన్‌రెడ్డి, ముఖ్యమంత్రి కేసీఆర్‌ఆర్, నీటిపారుదల శాఖమంత్రి హరీశ్‌రావుల తోడ్పాటుతో అదనంగా 15 టీఎంసీలు పెంచగలిగారు. దీంతో 40 టీఎంసీల కేటాయింపు జరిగింది.

ప్రస్తుతం ఈ ఎత్తిపోతల పథకం ద్వారా నాగర్‌కర్నూల్ జిల్లాలోని బిజినేపల్లి మండలంలోగల అల్లీపూర్ నుంచి బుద్ధారం చెరువు, వనపర్తి జిల్లాలోని తాడిపరి, చిమనగుంటపల్లి, అంకూ ర్ చెరువులను నింపడం జరిగింది. అరువై ఏండ్లలో నీళ్లివ్వలేని గత సీమాంధ్ర పాలకులతో ఉమ్మడి పాలమూరు జిల్లా 60 ఏం డ్ల వెనక్కి వెళ్లిపోయింది. పాలమూరు జిల్లా ఎండిపోతుంటే ఏ ముఖ్యమంత్రి కూడా పట్టించుకున్న పాపానపోలేదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చినంకనే పాలమూరు జలసిరుల జిల్లాగా మారుతున్నది. వలస పోయినోళ్లు తిరిగి జిల్లాకే వలస వస్తున్నరు. పాడుపడిన పొలాలను పచ్చగా పండించుకుంటున్నరు. ఏడాదిలో రెండు పంటలను వేసుకుంటు సల్లగా బతుకుతున్నరు.
DrSrikanth 
ఉమ్మడి పాలమూరు జిల్లాకు సాగు, తాగునీరు అందుతున్న సందర్భంలో వనపర్తి జిల్లా కేంద్రంలో నేడు రాష్ట్రస్థాయి జల కవితోత్సవం జరుగుతున్నది. నీటి ప్రాముఖ్యాన్ని తెలిపే వచన, పద్య, గేయ, కవితా రూపాల్లో కవులు తమ రచనలను వినిపించనున్నారు. వచ్చిన కవితలన్నింటినీ పుస్తకరూపంలో వెలువ రుస్తాం. ఈ కవి సమ్మేళనానికి రాష్ట్రంలోని 31 జిల్లాల నుంచి కవులను ఆహ్వానిస్తున్నాం.
 డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి