మనం దినపత్రిక 06-05-2018
💧జలాభిషేకం*💧
-----------//////---------

జలం వానచినుకై కురుస్తుందా
పురివిప్పిన నెమలిలా నేలంతా స్నానిస్తుంది
జలం నిండు కృష్ణమ్మై ప్రవహిస్తుందా
బీడుపొలాలలో పసిడిపంటలను తలపిస్తుంది

జలం భగీరథునిలా పరుగెడుతుందా
ఒట్టిపోయిన ఎడారి ప్రాజెక్టులు 
గలగలపారే సెలయేళ్ళు అవుతాయి
జలం ఆకుపచ్చని తెలంగాణను కంటుందా
ప్రజల దాహార్తిని తీర్చే జలగీతమవుతుంది

ఇప్పుడు... జలమంటే తెలంగాణ
ఇప్పుడు... ప్రాజెక్టులంటే తెలంగాణ

ఒక్కప్పుడు వలసగీతం పాడిన జిల్లా
ఇప్పుడు స్వేచ్ఛాగీతాన్ని ఆలపిస్తోంది
ఒక్కప్పుడు కరువుకు సంకేతమైన జిల్లా
ఇప్పుడు జలగీతమై నిండుగా పాడుతోంది

ఏళ్ళుగా తల్లడిల్లిన వానచినుకంతా
పచ్చని భూమిస్వప్నాన్ని కంటుంది
ఏళ్లుగా తడారిపోయిన గొంతుకలకు
సంజీవనై ప్రాణభిక్ష పెడుతోంది

కాలాన్ని మరచిపోయిన వానచినుకు
వసంతాన్ని ఆలింగనం చేసుకుంటోంది
వలసలకు పుట్టినిల్లైన పాలమూరుకు
జలపాతం ఆభరణమై అల్లుకుంటోంది

కాలాన్ని ఎప్పుడూ నమ్మొద్దు
ఎప్పుడు కాటేస్తుందో...
ఎప్పుడు మురిపిస్తుందో...

మానవ ప్రయత్నమిపుడు సాకారమై 
కళ్ళనిండా చినుకులు కురుస్తున్నవి
పాలమూరు పసిడిపంటల సాక్షిగా
జలమిప్పుడు పాతాళగంగై పొంగుతున్నది

కరువుతో అల్లాడిన రైతన్నలకు
ఆపన్నహస్తమై ఆదుకుంటున్నది
జలసిరులు అమృతమై పొంగిపొరలి
పాలమూరును పచ్చగా చేస్తున్నది
కరువుకు ఇక దండం పెడుతూ
ఆకుపచ్చని పాలమూరును కంటున్నది
ఆకుపచ్చని పాలమూరును కంటున్నది

(మే 6 న వనపర్తి లో జరిగే జలకవితోత్సవం సందర్భంగా)
🌷 డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ 🌷





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి