🌷*మొగ్గలు*🌷

ఎన్ని మొగ్గలను చిగురింపచేస్తేనో కదా 
ఇల్లంతా నందనవనమై గుభాళించేది
ఆడపిల్ల అంటేనే సువాసనల గంధపుచెట్టు

ఎన్ని చిరునవ్వులను వెలిగిస్తేనో కదా
ఇల్లంతా వెన్నెలహారమై ప్రకాశించేది
ఆడపిల్ల అంటేనే ఇంటికి వెలుగు

ఎన్ని పలుకులతో సందడి చేస్తేనో కదా
ఇల్లంతా బృందావనమై కళకళలాడేది
ఆడపిల్ల అంటేనే నవ్వుల జలపాతం

ఎన్ని బాధలను తట్టుకుంటేనో కదా
గుండె నిబ్బరంగా జీవితాన్ని గెలిచేది
ఆడపిల్ల అంటేనే సబలగా సాక్షాత్కారం

ఎన్ని అనుబంధాలను ఆరాధిస్తేనో కదా
అనురాగదేవతై అవనిలో వెలిగేది
ఆడపిల్ల అంటేనే ఇంటిని వెలిగించే జ్యోతి


🌷 *మొగ్గలు*🌷

కవి మనస్సు గాయపడితేనే కదా
గాయం గేయమై ఆవిష్కృతమయ్యేది
కవి గేయం గుండెను తాకే ఆయుధం

గాలి పరిమళాన్ని మోస్తేనే కదా
పువ్వు వాసంతసమీరమై అల్లుకునేది
గాలి పువ్వును మోసే సుగంధరాజం

గండుకోయిల కమ్మగా కూస్తేనే కదా
వసంతాగమనం పరవశించి అరుదెంచేది
ప్రకృతికే పూసిన ఋతువు వసంతం

గాయపడిన మనిషి గేయమైతేనే కదా
బాధలను గేయాలుగా అక్షరీకరించేది
గేయం గాయపడిన మనిషి జ్ఞాపకం

పచ్చని నేల పరవశంగా ప్రసవిస్తేనే కదా
విత్తనం పసిమొగ్గలా నవ్వి విచ్చుకునేది
కొత్తజన్మకు ఊపిరిపోసేది నేలనే ఎప్పటికీ


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి