🌷 ఆసుపత్రి గీతం 🌷

గణేష్ దినపత్రిక 09-05-2018

వైద్యుడు నారాయణుడే
రోగుల ప్రాణాలను కాపాడే దేవుడే

కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న
రోగులకు ప్రాణభిక్షపెట్టే అపరధన్వంతరి
సత్తువ కోల్పోతున్న శిథిల దేహాలకు
లేపనం పూసే అపరసంజీవని

బాధల బరువుతో భారంగా అడుగులు వేస్తామా
ఆసుపత్రి ఆపన్నహస్తమై స్నేహహస్తమందిస్తుంది
అనుమానాల మెట్లతో ఆసుపత్రిని పలుకరిస్తామా
దిగులు చీకటికి వెలుగురేఖయై ప్రసరిస్తుంది

గుండెలో తొలుస్తున్న అనుమానాలకు
వైద్యుడి పలకరింత ఒకింత ఉపశమనం
వట్టిపోయిన మనిషి గాయాలకు
వైద్యుడి చికిత్స వేకువ రవికిరణం

అక్కడ బతుకు ఒక నిత్యపోరాటం
జీవించాలన్న తపనకు మూలసూత్రం
దినదినగండంగా బతకడమే
ఆసుపత్రి నేర్పిన జీవనసూత్రం

వైద్యపరీక్షల ఫలితాలు తేలనిదే
రోగులకు బతుకు తెల్లారదు
పరీక్షల మీద పరీక్షలు చేపట్టనిదే
వైద్యుల నాడీ అంతుపట్టదు

ఎన్ని రోజులు పడుతుందో 
రోగి జబ్బు నయం కావడానికి
ఎన్ని రాత్రులు తెల్లవారాల్లో
రోగం ప్రపంచాన్ని పలకరించడానికి

వైద్యసేవలు అనునిత్యం అందిస్తున్నా
రోగం నవ్వుతూ రోగిని వెక్కిరిస్తుంటుంది
గంటలు యుగాల్లా గడిచిపోతున్నా
వైద్యం మౌనరాగాలను ఆలపిస్తుంటుంది

ఆసుపత్రిలో అడుగు పెట్టినామంటే
బతుకుపై ఆశలు ఆవిరవుతుంటాయి
వైద్యుల ప్రశ్నలకు ఉక్కిరిబిక్కిరవుతున్నామంటే
బతుకుపై ఆశలు సన్నగిల్లుతుంటాయి

సూర్యుడు ఉదయిస్తున్నాడంటే 
అస్తమయానికి దగ్గర అవుతున్నట్టే
వెలుగు కాంతికిరణమై ప్రసరిస్తుందంటే
చీకటిగాయాల తోకలు ముడిచినట్టే

అవును...
వైద్యుడు నారాయణుడు
వైద్యో నారాయణో హరి !

✍✍⚘ డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ ⚘🌷



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి