అతడు నిత్యం భుజాలపై
బతుకు బరువును మోసే క్రీస్తు
బీడువారిన పొలాన్ని
ఆకుపచ్చని చందమామను చేసే
పత్రహరితం
కన్నీరింకిన పొలంలో
పన్నీరును చిలికించే అభయహస్తం
తడి ఆరని భూమి దేహానికి
దాహార్తిని తీర్చే ఒయాసిస్సు
పగుళ్లిచిన పొలానికి
పొడరసమై ప్రవహించే జలపాతం !
ఆకలితో అలమటించే
జనావళికి దాహం తీర్చే అన్నదాత వాడు
కల్పతరువుగా మార్చినవాడు
అకుపచ్చని లోకంలో
చెమటముత్యమై మెరిసేవాడు
ఆకలి సమాజానికి అనునిత్యం
అన్నంముద్ద పెట్టేవాడు
గింజగింజపై తన పేరుండే రైతన్న
వాన చినుకు కోసం
ఆత్రంగా చూస్తాడు వాడిపుడు
బీడై పగుళ్లిచ్చాడు
బతుకుబరువై బక్కచిక్కాడు
ఎడారైన పొలంలో
తన పాదముద్రలను స్వప్నిస్తున్నాడు
ఎండిన పంటను చూసి మట్టి విత్తనాలను కావలించుకుంటున్నాడు
మట్టిని మాణిఖ్యం చేసివాడు
మరణశాసనాన్ని లిఖిస్తున్నాడువాడు
అతివృష్టిలో- అనావృష్టి
అనావృష్టిలో -కర్మిష్టి
వాడికిపుడు
ఓదార్పుకాదు ఆసరాకావాలి
ఎండిన పంటకు గిట్టుబాటు కావాలి
రైతేరాజని నాగళ్లు నవ్వాలి
రైతేరాజని నాగళ్లు నవ్వాలి
- డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్  Published Sunday, 27 March 2016 ఆంధ్రభూమి 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి