114. గజల్ 


''పలుకు'' కవితా సంపుటిలో ప్రచురించబడిన కవిత 


క్షణాలను మోస్తూ కాలమై వెలుగుతుంటాను
అక్షరాలను వెలిగిస్తూ కవితనై ప్రకాశిస్తుంటాను

నిరంతరం కవితాలతలను అల్లుతూనే                
లోకంలో కవితాజ్యోతులను వెలిగిస్తుంటాను

అక్షరాలను కాలరేఖపై నిత్యం చిత్రిస్తూనే 
చరిత్రను ఒడిసిపట్టి భవిష్యత్తుకు అందిస్తుంటాను

వర్తమానాన్ని కలం కవాతుతో పరుగులు పెట్టిస్తూనే 
ప్రతి క్షణాన్ని పహారా కాస్తూ చరితగా లిఖిస్తుంటాను

సమాజాన్ని కలంతో చిత్రిక పడుతూనే
వాస్తవాన్ని కౌగిలించుకొని కవితను రాస్తుంటాను

కాలయవనికపై పాదముద్రలు బలంగా వేస్తూనే
కాలనాళికనై కవిత కరవాలం ఝళిపిస్తుంటాను

ఎన్ని కవితలు రాశావని కాదు భీంపల్లి              
కాలానికి నిలబడేవి ఎన్నని ప్రశ్నిస్తుంటాను

 *భీంపల్లి శ్రీకాంత్*
28-01-2018



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి