ప్రణాళిక బద్దమైన ఏ కవితా ప్రక్రియ అయిన ఎక్కువ కాలం సాహిత్యంలో మనుగడ ఉంటుంది. అంతేకాదు సేద్దాంతిక ధృక్పధం ; బలమైన శిల్పం ; వస్తు అనుకూల్యత ఇలాంటివి ఉండడమే ఏ కవితా ప్రక్రియ మనుగడకైనా అవసరం. అలాంటి మంచి కవిత ప్రక్రియనే భీంపల్లి శ్రీకాంత్ గారు సృష్టించిన " మొగ్గలు " కవిత ప్రక్రియ.
ఇదీ 3 పాదాలుగా సాగే ప్రక్రియ.( మరీ ఇలా 3 పాదాలు తో సాగే ప్రక్రియలు తెలుగు లేవా అంటే ...వున్నాయి) జపాన్ ప్రభావం తో వచ్చిన హైకూ 3 పాదాల తో 17 మాత్రాలు కలిగిన త్రిపద. దీనిని తొలిసారిగా గాలినాసర రెడ్డిగా అనువాదం చేశారు.అయితే తొలి తెలుగు హైకూ అనువాదం మాత్రం పెన్నా శివరామ కృష్ణగారి " రహస్య ద్వారం" .
హైకూ లక్షణాల విషయంకూ వస్తే జపాన్ లో అక్షరాల దృష్యా 3 పాదాల లో (5-7-5) అక్షరాలుగా వారు లక్షణికరించుకున్నారు.కానీ తెలుగు లో అక్షరాల సంఖ్య దృష్ట్యా ఇదీ కష్టసాధ్య విషయం . అందుకే చాలా మంది హైకూలను మూడు పొట్టి పాదాలు అనే భావంతోనే రాసారు.
ఇక త్రిపద విషయం కు వస్తే మూడు పాదాల తో త్రిపదలను బోయి భీమన్న గారు రాసారు.
" నీవూ నా శరీరం కోరడం లేదు
నేనూ నీ శరీరం కోరడం లేదు
శరీరాలు మనల్ని కోరుతున్నాయి "
ఇలా భీమన్న గారు మూడు పాదాలుగా త్రిపదలు రాసారు. అయితే పై లక్షణాలకు భిన్నమైన కవిత్వం " మొగ్గలు".
మొగ్గలకు ఉన్న లక్షణాలను గమనిస్తే భీంపల్లి గారు చెప్పీనట్లు...
" మొగ్గలు మూడు పాదాల కవిత్వం.
మొదటి రెండు పాదాలు ఒక అంశాన్ని చెబితే మూడవ పాదం దానిని సమర్థించేదిగా ఉంటుంది " .
అయితే వీరూ ప్రత్యేకం గా చెప్పని నియమం ఏమిటంటే మూడు పాదాలలో మొదటి పాదంకు కొనసాగింపుగా రెండవ పాదం వుండాలి. అంటే మొదట పాదం లో వాక్యం అంతం కారాదు.ఉదాహరణకు బోల యాదయ్య గారి మొగ్గ
" సెమట గుండె కండ్లల్లో
పల్గిపోయిన పంటకాల్వ కన్నీరై పారింది
పొలమారిన పాలమూరు బతుకు చిత్రం "
మరో విధంగా చెప్పాలంటే కొన్ని సార్లు మొదటి రెండు పాదాలు ఒక
" సంశ్లిష్ట వాక్యం" లా ఉండాలి . ఇదే విషయం భీంపల్లి గారు రాసినా మొగ్గలలో 2;3 పాదాల లో ఉండడం నేనూ గమనించాను. అంటే కవితా సౌలభ్యం బట్టీ ఉపయోగించుకోవచ్చు అనీ తెలుస్తుంది
మొగ్గలు ప్రక్రియను భీంపల్లి శ్రీకాంత్ గారు యాదృచ్ఛికం గా మొదలు పెట్టారు. మొగ్గలను మొదటగా Nov- 20 / 2017 నాడు అంకురార్పణ చేసారు. అలా నేటి వరకు దాదాపుగా 200 కు పైగా మొగ్గలను రాసారు. వారి సహచర్యం లోనే మరో కవి బోల యాదయ్య గారు శతాధిక మొగ్గలను రాసారు.
. కవిత్వంలో వుండే కవిత ప్రక్రియలకు ఎందుకీ నియమాలు అంటే ఏం చెబుతాం. ఆ నియమాలే ఆ ప్రక్రియలకు వన్నె తెస్తాయి.
" ప్రవాహనికైనా
కట్టడి లేకపోతే
అదీ
ప్రళయమవుతుంది "
మొగ్గలు మరీ కఠిన ప్రక్రియకాదు.అర్ధం చేసుకోని సులభసాధ్యంలా రాయవచ్చు. కొత్త గా వచ్చే యువకవులకు ఇదీ మంచి వేదిక లాంటి ప్రక్రియ.
ఇప్పుడీప్పుడే విచ్చుకుంటున్న ఈ మొగ్గలు ప్రక్రియలో ధశాధిక (10) కవులు . మొగ్గలు పూయించుటకు ప్రయత్నం చేస్తున్నారు.ఆ కవులు రాసినా కొన్ని మొగ్గలను ఇప్పుడు చూద్దాం....
" పండగకని ఊరొచ్చిన ప్రతిసారీ
స్వర్గం చేరినంత హాయిగా అనిపిస్తుంది
పుట్టిన ఊరే అసలైన స్వర్గం"
--- రవివర్మ ఆకుల
"ప్రతి అక్షరం లో తొంగి చూసి
హృదయాoతరంగాన్ని ఆవిష్కృతం చేస్తది
కావ్య నాయక నా చెలి"
--- వి.పుష్పలత
" ఆయన పోరాటం ఎప్పుడూ
భూమితోనే చావైనా,బతుకైనా
భూతల్లితో విడదీయరాని బంధం రైతన్నది
- కె.పి.లక్ష్మీ నరసింహ
" ఎటూ చూసీనా అంధకారమే అనుకోకులే
కటిక చీకట్లలోనూ తారలు వెలుగుతుంటాయి
తరగని అక్షయ పాత్ర ఆత్మస్థైర్యం "
- ఐ.చిదానందం
" ప్రపంచాన్ని చూపించే పాఠశాల
ప్రగతిదారులను చూపే విజ్ఞానమందిరం
పాఠశాల వికసించే విజ్ఞాన పూదోట --- టి.అంబుజ
"మనిషిని మహోన్నతంగా తీర్చి దిద్ది
మనిషి విలువను మరింత పెంచుతుంది
పుస్తకమే కదా హస్తభూషణం
--- శ్రీదాస్యం లక్ష్మయ్య
" సుఖదుఃఖాల్లో వాడు సగభాగమై
ఆపద కొండంతైన అండగా నిలుస్తడు
స్నేహితుడు వెన్నంటి ఉండే నీడ
--- పొన్నగంటి ప్రభాకర్
" అజ్ఞానాంధకారం ఆవహించినప్పుడల్లా
విజ్ఞాన రేకై విచ్చుకుంటూనే ఉంటుంది
జ్ఞానాన్ని పంచే వెలుగు దివిటి పుస్తకం
--- భీంపల్లి శ్రీకాంత్
" కనుపాపలు నిప్పులపై నడిచిన
నీ రూపాని దహించ లేదు
ఆమే నా రక్తంలో మెులిచిన నక్షత్రం
--- బోల యాదయ్య
" ఐక్యంగా ముందుకు సాగితేనే కదా
జీవితాన అఖండ విజయాలు
ఐకమత్యమే మహాబలం
--- రూప
" అమ్మ నన్ను ప్రేమతో లాలించినప్పుడల్లా
నాన్న స్నేహహస్తం చెలెమెనే అవుతుంది
అమ్మానాన్నలే ఆదర్శం అఖిల ప్రపంచానికి "
---- అంజయ్య గౌడ్

దాదాపు గా పదికీ పైగా కవులు మొగ్గలు రాస్తున్న శిల్ప పరంగా ; వస్తు పరంగా మంచి కవితలు రాస్తున్నవారు మాత్రం శ్రీకాంత్ గారు ; బోల యాదయ్య గార్లే. మిగతా కవులు ఉత్సాహంగా రాస్తున్న వారింకా ఆ ప్రక్రియకు అలవాటు పడలేదు. మొగ్గలు రాస్తున్న కవులను ప్రోత్సాహం ఇస్తూ వారి శైలి లో లోపాలను సరిచేయాలిసిన అవసరం వుంది. నిజానికీ విషయంను శ్రీకాంత్ గారు భాధ్యత గా నిర్వహిస్తున్నారు.ఎక్కడ అతిగా పోకుండా వినయం తో వ్యవహరిస్తూ వున్న పరిధిలో కవులను ప్రోత్సాహీస్తున్నారు శ్రీకాంత్ గారు.
ఇక విమర్శల విషయంకు వస్తే ఒకప్పుడు కవిత్వంలో విమర్శ అంటే భాద్యత గా వ్యవహరించడమే .కానీ నేటి కాలం లో అదీ మారింది.
ఆత్మాభిమానం కు విఘాతం కలిగించేలా కవిత్వ పరంగా కాకుండా వ్యక్తిగతం గా అసత్య ప్రచారాలకు పూనుకుంటున్నారు.ఇదీ వారి పలాయన వాదం ; పిరికితనం . మరో విధంగా అమానుషం కూడా.
వి.ఆర్.విద్యార్ధి కవి అన్నట్లు " కవిత్వం చదవాలనుకున్నప్పుడు ముందుగా కవి పేరు చూడవద్దు.కేవలం కవితనే చదవాలి.ఒకవేళ నీకూ ఆ కవిత నచ్చితే అప్పుడే ఆ కవి పేరు చూడాలి "
ఏదైనా కవితా ప్రక్రియ తెలుగు లో ప్రారంభం అయిదంటే మొదట దానినీ సమీక్షించిన తరవాతనే విమర్శించాలి. విమర్శకు నిదానం కావలి. అలాంటి విమర్శయే ఈ మొగ్గలకు అవసరం.వ్యక్తిగత వివాదాలతో వివక్షతో మొగ్గలోనే కవిత్వంను తుంచరాదు. ఎందుకంటే విషం ఒక్కసారే ప్రభావం చూపును.కానీ విమర్శ చాలా కాలం వరకు ఇతరులను విషమయం చేస్తున్నై వుంటుంది. అలా అనీ అస్సలు విమర్శయే వద్దన రాదు . ఎందుకంటే " సాన బెడితేనే వజ్రం మెరుస్తోంది " .
నిజానికీ వచనకవిత్వం పై వచ్చినంత విమర్శ మినీ కవిత్వ ప్రక్రియల పై రాలేదు. అందుకే కొన్నీ మంచి ప్రక్రియలు త్వరగా మరుగున పడ్డాయి. తెలుగు కవిత్వం లో ప్రచారం లేక వెనుకబడిన ప్రక్రియలు ఎన్నో కలవు. పొట్టిలు ; చిట్టిలు ; టంకాలు ( ఎన్.ఎస్.మూర్తి ) ; వీక్షణాలు ( ఈట్ల సమన్న); నానోలు ( ఈగ హనుమంత రావు ) వంటి కవితా ప్రక్రియలు శిల్పపరంగా కంటే ప్రచారంపరంగానే దూరమయినవని తెలుస్తుంది.
మరో కవితా ప్రక్రియ " వ్యంజాకాలు " . దీని సృష్టికర్త పోత్తూరి సుబ్భారావు గారు. ఈ ప్రక్రియ కూడా మొగ్గలు లాగానే శిల్ప పరంగా మంచి పక్రియ. 4- పాదాలు గల వ్యంజాకాలు మొదటి రెండు పాదాలు ఒక విషయం చెబితే ఆ విషయం ను విభేదిస్తు చివరి రెండు పాదాలు వుంటాయి. ఈ ప్రక్రియను సుబ్బారావు గారు తన " సాహితీ కిరణం " పత్రిక ద్వారా ప్రచారంలోకీ తెస్తున్నారు. అలాంటి ప్రచారం నే భీంపల్లి గారు అవలంబిస్తే ఈ కవితా ప్రక్రియలో మరిన్ని మొగ్గలు మొలకెత్తవచ్చు.
ఏ కవితా ప్రక్రియనైన సాహిత్యంలో నిలదొక్కుకుకోవడం అంత ఈజీ యేం కాదు.ఎన్నో అటుపోట్లను సూటిపోటీ మాటలను ఎదుర్కొనవలిసి వస్తుంది. అయినా సరే వాటికీ తట్టుకొని రాటుదేలిన కవితా ప్రక్రియలేన్నో . ఉదాహరణ కు నానీలు. ఈ నానీలు తొలినాళ్ళ లో తీవ్ర విమర్శల పాలైనది . అయిన సరే నిలబడి దాదాపుగా 300 కు పైగా కవులు నానీలు రాసారు. దానికీ కారణం నానీల సృష్టికర్త గోపి గారు మరియు నానీ తొలి తరం కవి డా.ఎస్.రఘు గారు విమర్శల విషయంలో హేతుబద్ధంగా వ్యవహరించి నానీలను ప్రచారం చేయడంలో నానీ కవులకు వెన్నుదన్ను గా నిలిచి విజయవంతం సాధించారు. అలాంటి ఖచ్చితత్వమే మొగ్గలు ప్రక్రియకు బలం ను ఇస్తుంది.
మొగ్గలు కవితా పక్రియ ఇప్పటి వరకు ఒక్క కవితా సంపుటం కూడా విడుదల కాలేదు. కవితా సంపుటికీ కావాలిసిన కవితాసంపద వున్నా " మొగ్గలు నాన్న " శ్రీకాంత్ గారు దాదాపుగా 300 కు పైగా మొగ్గలను పూయించిన తర్వాతే సంపుటి గా ప్రచురించాలనీ సంకల్పించారు. ఈ దశలోనే వారు 200 ల మొగ్గలను ఆవిష్కరణ చేసారు.
అలాగే పాలమూరు యువకవి కిశోరం " మొగ్గల బాబాయి " బోల యాదయ్య గారు కూడా వందకు పైగా మొగ్గలను రాసారు. ఇవీ త్వరలోనే సంపుటిలు గా వస్తాయి. కవితాభిమానులను తప్పక అలరిస్తాయి. ఈ కవిత పక్రియ ఆదరణ పొంది మరింత కవులు రావాలనీ ఆశిస్తూ ......

* ఐ.చిదానందం *
పరిశోధక విద్యార్థి 

ఉస్మానియా విశ్వవిద్యాలయం  
చరవాణి :- 8801444335


1 కామెంట్‌:

  1. మొగ్గలు,వ్యంజకాలు వంటి కవితా ప్రక్రియలు.. కవితల పట్ల ఆసక్తి ని రాసే అలవాటు ను ప్రోది చేయడం లో ఎంతో స్ఫూర్తి నిచ్చిన నూతన ఒరవడి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు!..నేమాన సుభాష్ చంద్ర బోస్...8790938924..(మెసేజెస్ ఓన్లీ)

    రిప్లయితొలగించండి