*చరిత్రను ఆలింగనం చేసుకుందాం* Jan 2, 2018

వర్తమానమంతా గతచరిత్ర ఆనవాళ్లే 
భవిష్యత్తంతా వర్తమాన పాదముద్రలే

అడుగులు వేస్తున్నకొద్దీ 
చరిత్ర ఆనవాళ్లు ఆగమిస్తూనే ఉంటాయి
చరిత్రను తవ్వినకొద్దీ గత వైభవ జ్ఞాపకాలు 
కళ్ళముందు సాక్షాత్కరిస్తూనే ఉంటాయి

పాతది ఏదైనా చరిత్రకు ఆయువుపట్టు
కొత్తది ఎప్పుడైనా భవిష్యత్తుకు
తేనేపట్టు

ఎన్ని యుగాలను దాటి ఇక్కడి దాకా వచ్చాం
ఎన్ని కాలాలను కౌగిలించుకుని వర్తమానంలో బతుకుతున్నాం

చరిత్రను నిత్యసంజీవని చేస్తూ 
భావిజీవితానికి తోరణాలు కడుతున్నాం
గతాన్ని నెమరువేసుకుంటూనే ఆగామి వసంతానికి ద్వారాలను తెరుస్తున్నాం

ప్రపంచమే లేకపోతే చరిత్ర ఎక్కడిది
నాగరికతే తెలియకపోతే సంస్కృతి మరెక్కడిది

చరిత్రను.... నదిలా చూస్తామా
 కన్నీటి వరదై ముంచెత్తుతుంది
సముద్రంలా భావిస్తామా 
 ఆటుపోట్ల తరంగమై పోటెత్తుతుంది

చరిత్ర నిండా మానని గాయాలే 
దాని ఎద నిండా ముల్లుగర్రలే

చరిత్ర ఏదైనా కాలవాహినిలో 
నిత్య తారకమంత్రం
కాలయవనికపై చెదిరిపోని నిత్య సుమగంధం

చరిత్రను వారసత్వ సంపదగా మోస్తే తప్ప 
వర్తమానానికి ఆనవాళ్లు ఉండవు
భవిష్యత్తుకు భరోసానివ్వాలంటే వర్తమానాన్ని 
చరిత్రగా చెయ్యక తప్పదు 

శిలాశాసనమో,రాగి శాసనమో 
చరిత్రను పట్టిచూపే దిక్సూచి
తాళపత్రమో,రాతపత్రమో 
వారసత్వాన్ని అందించే కాలసూచి

మూడు కాలాలను ముడివేసే ఏకతాస్వరం చరిత్ర
యుగాలను దాటి వచ్చిన యుగపతాక చరిత్ర
మనదైన అస్తిత్వానికి కీర్తిమకుటం చరిత్ర
కారుచీకట్లను చీల్చివేసిన వెలుగుదివిటి చరిత్ర
నాగరికతకు నడక నేర్పిన
సాంస్కృతిక దీపిక చరిత్ర
నడుస్తున్న జీవితానికి ఊతకర్ర చరిత్ర
నడుస్తున్న జీవితానికి ఊతకర్ర చరిత్ర

- డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి