మొగ్గలు

💓 *ప్రేమ రుబాయిలు* 💓


చినుకు కోసం భూమి ఎదురుచూస్తూ ఉంటుంది
నీ కోసం మనసు పలవరిస్తూ ఉంటుంది 
నువ్వే లేకపోతే నేనేమిటి ప్రియా
నీ పిలుపు కోసం హృదయం తపిస్తూనే ఉంటుంది

ఎక్కడ వెతకగలను నీ జాడ కోసం
ఎక్కడ వినగలను నీ పిలుపు కోసం
కనిపిస్తూనే మాయమవుతుంటావు నువ్వు
ఎక్కడ చూడగలను నీ నవ్వు కోసం

కోయిల రాగమే మనసుకు ఆనందనందనం
నీ చిరుపలుకులే మనసుకు 
రాగనందనం
సరిగమలే సంగీతానికి ఆయువుపట్టు
నీ నవ్వులే నాకు వెలలేని మాగాణం

నువ్వు వెళ్ళిపోగానే చీకటయ్యింది మనసు
నువ్వు లేవనే మూగవోయింది మనసు
ఒంటరై పోవడం విషాదమే ప్రియా
నువ్వు లేకపోవడం వియోగమయ్యింది మనసు

నీ కోసం ఎన్ని కన్నీళ్లను రాల్చగలను
నీ కోసం ఎన్ని రోజులు చూడగలను
ఎదురుచూడడంలోనే ఎంతో ఆనందం
నీ కోసం ఎన్ని కాలాలు ఒడిసి పట్టగలను

మమతను పంచే అనురాగానివి నువ్వు
మనసును ప్రేమించే అనుబంధానివి నువ్వు
నిలువెల్లా ప్రేమ నీ సుగుణం ప్రియా
అందరినీ ఆదరించే ఆత్మీయత నువ్వు

అరవిరిసిన నీ నవ్వును చూసి పువ్వు అసూయపడింది 
చిట్టిపొట్టి నీ పలుకులను చూసి చిలుక మూగవోయింది
ప్రకృతికే నువ్వు నడకలు నేర్పినదానివి
అందమైన నీ అభినయం చూసి నెమలి నాట్యమాపింది

నిస్వార్ధమైన నీ స్నేహానికి నిండుగా నీరాజనం 
మమత పంచే హృదయానికి మనసు నిండా నివేదనం
నిర్మలమైన ప్రేమ నిజాయితిగా ఉంటుంది ఎప్పుడూ
ప్రేమను కురిపించే నీ కళ్ళకెపుడూ అభివందనం

ఎన్ని కలల కలవరింతల ఫలితమో నువ్వు
ఎన్ని ఎదురుచూపుల నిరీక్షణో నువ్వు
ప్రేమంటే యుగయుగాల తపస్సు
ఎన్ని విరహగీతాల స్వప్నమో నువ్వు

చిరుగాలిలా వచ్చి పలకరిస్తుంది తను
చిటపట చినుకై తడిపిపోతుంది తను
ఆమె రాకనే వసంతోదయం నాకు
చిలుకపలుకై నన్ను అల్లుకుపోతుంది తను

        🖌  డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్        


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి