మొగ్గలు Jan 2, 2018

ఆలోచనలు వెంటాడినప్పుడల్లా
అక్షరాలు మొలకెత్తుతూనే ఉంటాయ్
అక్షర సంగమం కవిత్వం

దూరాలు ఆహ్వానించినప్పుడల్లా 
గమనాలు పరుగు పెడుతూనే ఉంటాయ్
గమ్యం చివరి మజిలీ

హృదయాలు ఆవిష్కరించినప్పుడల్లా 
స్నేహపరిమళాలు వికసిస్తూనే ఉంటాయ్
స్నేహం అనురాగసంగమం

పువ్వులు విరబూసినప్పుడల్లా
సుగంధాలు ఆహ్లాదపరుస్తూనే ఉంటాయ్
పరిమళం అందరికీ మకరందం

జ్ఞాపకాలు గుర్తొచ్చినప్పుడల్లా
అనుభవాలు పలకరిస్తూనే ఉంటాయ్
గుండెతడి జ్ఞాపకాల మూట

ఉదయాలు ప్రభవించినప్పుడల్లా 
కిరణాలు ప్రకాశిస్తూనే ఉంటాయ్
ఉషస్సు లోకానికి వెలుగు

ఆనందాలు అతిశయించినప్పడల్లా 
సంతోషాలు చిగురిస్తూనే ఉంటాయ్
మనసు మమతల లోగిలి

నదులు ప్రవహించినప్పుడల్లా
 సముద్రాలు ఆహ్వానిస్తూనే ఉంటాయ్
సాగరం అనంత తటాకం

పక్షులు ఎగిరినప్పుడల్లా
మలయమారుతాలు పరవశిస్తూనే ఉంటాయ్ 
సమీరం వసంతరాగం

శిల్పాలు తయారైనప్పుడల్లా  
శిలలు ఆనందిస్తూనే ఉంటాయ్
శిల్పి జన్మ చరితార్థం

బతుకులు సాగిపోతున్నప్పడల్లా 
కష్టాలు వెంటాడుతూనే ఉంటాయ్
జీవితం కష్టసుఖాల కలబోత

- డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి