వానచినుకులు నేలను ముద్ధాడితేనే కానీ
బీడు పొలం పకపక నవ్వదు
చినుకంటే నేలకు పండుగ

అనుభవాలను పాఠంగా నేర్చుకుంటే కానీ
ప్రతి అడుగు బాటగా వెయ్యలేము
జీవితం ఒక అనుభవాల పేటిక

క్షణాలు దొర్లిపోతేనే కానీ
కాలం విలువ తెలియదు
తిరిగి రానిది కాలం ఒక్కటే

చరిత్రను చదివితేనే కానీ
గతం ఒళ్ళంతా పాకదు
చరిత్ర కొన్ని తరాల సర్వస్వం

మానవత్వంతో మసిలితేనే కానీ
సమానత్వ బీజాలు నాటుకోవు
సమానత ఒక మానవతా దీపిక

చెరువు నిండితేనే కానీ
ఊరు పండుగలా నవ్వదు
వానకాలమైతే ఊరంతా జాతర

పొలాన్ని దున్నితేనే కానీ
మట్టి మహానందాన్ని పొందదు
విత్తనాలు మట్టి బిడ్డలు

మొక్కలు నాటితేనే కానీ
ప్రకృతి భవిష్యత్తుకై ఎదురుచూడదు
పచ్చదనం  ఒక వసంతయానం 

కల్మషాలకు దూరమైతేనే కానీ
మనస్సు ఆనందతాండవం చేయదు
ప్రశాంత జీవనమే ఉత్తమమార్గం

కిరణాలు ప్రసరిస్తేనే కానీ
చీకటి తోక ముడవదు
వెలుగు ఒక కాగడా

🖌  డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్        


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి