*సుగంధం* Jan 2, 2018

ప్రపంచాన్ని తన గుప్పిట్లో ఉంచుకునేలా చేసే 
సహజ సౌందర్యం దాని సొంతం

ఆత్మీయమైన పలకరింపుతో 
మానసికానందాన్ని కలిగించే
సహజమైన ఔషధం దాని అస్తిత్వం

పరిమళించే స్నేహ సుగంధానికి వారధి
మధురానుభూతుల ఆవిష్కరణకు పునాది

చిరు పరిచయాన్ని బలమైన స్నేహంగా 
మార్చగలిగే దివ్యౌషధం
నేనున్నానంటూ భరోసానిచ్చే మానసిక ధైర్యం

కొత్త వారిని పాతమిత్రులుగా చేసే స్నేహమంత్రం
విడదీయరాని అనుబంధానికి 
ఆత్మీయపత్రం

ఆపదలో, విషాదంలో  ఆపన్నహస్తం
సుఖంలో, సంతోషంలో ఆనందభాష్పం

కోటిమల్లెలు ఒకేసారి విచ్చుకున్నట్లు దాని సోయగం
శతకోటి చంద్రోదయాలు ఒకేసారి ప్రకాశించినట్లు 
దాని పరిమళం

ఎన్నో బంధాలను కలిపే స్నేహవారధి అది
మరెన్నో అనుబంధాలను 
బంధించే అనురాగపు తడి

చీకటైన జీవితంలో చిరుదీపమై  వెలుగుతుంది 
కష్టమైన బతుకుపోరులో ఆనందాలను పంచుతుంది

మానసిక ఒత్తిడిని దూరం చేసే 
మహిమాన్విత మకరందం
నవయవ్వన తేజస్సును మనకందించే 
నిత్యనూతన సౌరభం

ఆటుపోట్ల అలజడులను అవలీలగా దాటినా...
సంసార సాగరాలను సులభంగా ఈదినా...
నిచ్చెనమెట్ల స్నేహానికి నీడై పలకరించినా...
స్నేహవృక్షానికి బలమైన పునాది అయినా...
ఎల్లలులేని అనురాగ బంధానికి చిరునామా అయినా...
జీవితాన్ని చిగురింపజేసే
దివ్యమైన పరిమళం
అనుబంధాలను నిత్యశోభితం   
చేసే పరమౌషధం

కలకాలం నిలిచే స్నేహానికి వారధి వంటిది
జీవితాంతం తోడు నిలిచే అనుబంధానికి నీడలాంటిది

అందమైన చిరునవ్వే ఆనందాన్ని కల్గిస్తుంది
జీవితాన్ని గెలిచేందుకు గెలుపుబాట చూపిస్తుంది

- డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి