సావిత్రిబాయి పూలే కవిత


ధిక్కార స్వరం

ఆమె... చదువుల తల్లి
సమాజాన్ని సంస్కరించిన కల్పవల్లి

అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని 
ఎదిరించిన బహుజనస్వరం
చీకటి సమాజానికి 
వెలుగుదివిటై నిలిచిన వేకువకిరణం

ఆమె... విద్యాజ్యోతి
సమాజపు చైతన్యదీప్తి

బడుగు బలహీన వర్గాల్లో 
చైతన్యం నింపిన వజ్రసంకల్పం
కులమతాల అడ్డుగోడల్ని 
చీల్చిన అక్షర గాండీవం

ఆమె...మానవతామూర్తి
సమానతను కోరుకున్న సమతాస్ఫూర్తి       

అక్షరాలనే ఆయుధంగా చేసుకుని
చైతన్యం రగిల్చిన చైతన్యమూర్తి
చదువుతో మహిళాలోకాన్ని 
నిరంతరం తట్టిలేపిన ఆదిపరాశక్తి

అవును... ఆమె
విద్యా ఉద్యమానికి చుక్కానియై
శ్రీకారం చుట్టిన తొలి వనిత
అణగారిన వర్గాలకు దారిదీపమై
అడుగులు వేసిన అక్షర సవిత

ఆమె....
సమాజ మార్పు కోసం
నాంది పలికిన అసలైన సంఘసంస్కర్త
తొలి బడిని స్థాపించి
వెలుగులు పంచిన మహిళా విద్యావేత్త

అక్షర చైతన్యమే ఆమె నమ్మిన ఆయుధం
మహిళా వికాసమే ఆమె చూపిన మార్గం

అవును...!
ఆమె...చదువులతల్లి
మనకందరి కల్పవల్లి !
ఆమె... మన మహిళల స్ఫూర్తిప్రదాత
భావిజీవితపు భాగ్యోదయ విధాత !!

                              - భీంపల్లి శ్రీకాంత్ Jan 3, 2018 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి