మొగ్గలు

రాత్రి కలల్ని ఒడిసి పట్టుకుంటాను కదా
ఉదయాన్నే అవి సీతాకోకచిలుకల్లా ఎగిరిపోతాయి
కలలు మెలకువలోనే ఆరిపోయే దీపాలు

సుఖాల వెంబడి పరుగెత్తుతాను కదా
దుఃఖాల తోరణాలు ఆహ్వానిస్తూనే ఉంటాయి
సుఖదుఃఖాలు జీవితంలో వచ్చే రాత్రిపగలు

ప్రేమకోసం పరితపించి పోతుంటాను కదా
అందని ద్రాక్షలా అది దూరమైతూనే ఉంటుంది
ప్రేమంటే ఒక ఆత్మీయ ఆలింగనం

నీ ప్రేమకోసం తలుపుతడుతూనే ఉంటాను
నీ హృదయవాకిలిని ఎప్పుడు తెరుస్తావని
నువ్వు ఊపిరి పోస్తేనే కదా నేను బతికేది

నీ కోసం చకోరిపక్షినై ఎదురుచూస్తూనే
నీ పిలుపుకోసం నిరీక్షిస్తూ ఉంటాను 
నువ్వు ప్రేమదారిలో కనిపించని దేవతవు

✍ *భీంపల్లి శ్రీకాంత్*
   08-01-2018

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి