*మొగ్గలు*
అజ్ఞానాంధకారం ఆవహించినప్పుడల్లా
విజ్ఞాన రేకై విచ్చుకుంటూనే ఉంటుంది
జ్ఞానాన్ని పంచే వెలుగు దివిటి పుస్తకం

నిరాశ నిస్పృహలతో నిస్తేజమయినప్పుడల్లా
ఆశల పల్లవులను చిగురింపచేస్తూనే ఉంటుంది
భావికి బాటజూపే అక్షరనేస్తం పుస్తకం

రోజూ ఒక్కో పుటను విప్పుతున్నప్పడల్లా
చరిత్రను మనముందర నిలుపుతూనే ఉంటుంది
ప్రపంచాన్ని పరిచయం చేసే దిక్సూచి పుస్తకం

బంగారు బాల్యాన్ని గుర్తు చేసుకున్నప్పుడల్లా
నెమలీకయై కళ్ళముందు కదలాడుతూనే ఉంటుంది
మదిని దోచే జ్ఞాపకాల పూదోట పుస్తకం

జ్ఞాన సముపార్జనకు తపించిపోయినప్పుడల్లా
గమ్యాన్ని చేర్చే చుక్కానిలా ఆదుకుంటూనే ఉంటుంది
బతుకుబండిని లాగే చిరకాల నేస్తం పుస్తకం

*భీంపల్లి శ్రీకాంత్*
 January 18 at 08.00am

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి