నానీలు ఏం చేస్తాయి

నానీలు
ఏం చేస్తాయి
జీవితాన్ని వడబోసి
దీపాలను వెలిగిస్తాయి

నానీలంటే
నాలుగు పదాలే కాదు
సమస్త జగత్తు
మకరందాలు

కవి గుండెను
తడిమి చూడు
అన్నీ మానవతా
పరిమళాలే

నిరాశ అంచున
నిస్తేజమెందుకు
ఆశకు ఊపిరవ్వు
భవిష్యత్తు నీదే

ప్రతి మనిషిలో
కల్లోల సముద్రాలు
బయటికి చెప్పని
ఆటుపోట్లే

హృదయాన్నే
గెలుచుకోవాల్సింది
మంచి కవిత్వాన్ని
ఆవిష్కరించినపుడు

అక్షరాలు
కన్నీటిని కారుస్తున్నాయి
నిరుపేదల
బతుకులను చూసి

సిరాచుక్క
అక్షర నక్షత్రాలను
పూయిస్తుంది
ప్రతి తార కవిత్వమే

వాక్కుకు
విలువ ఎక్కువ
పెదవులకు మాత్రమే
ఆ శక్తి ఉంది

చిరునవ్వే
చెరగని సంతకం
ప్రతిరోజు
ఉషోదయ కిరణం

    - డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్
           2 Jan  2017

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి