📚అక్షర సేనాని📚
Jul 24, 2017


అతడు....
నిరంతరం కవితా సేద్యాన్ని పండించే కవి
కాలాన్ని నిద్రపోకుండా చేసే కవితారవి
కలానికి విశ్రాంతి లేకుండా కాలంతో పయనించే కవి

అతని కంటికి
ఏ వస్తువు తగలినా
అది కవిత్వమై వెలగాల్సిందే
అతని కలానికి అందనిది ఏదైనా 
అది సాహిత్యమై వికసించాల్సిందే

కవిత్వమే శ్వాసగా బతుకుతున్నవాడు
కవిత్వమే ప్రపంచమని
నమ్మినవాడు

కాలంతో పరుగెడుతూ
పచ్చని కవిత్వాన్ని ఆవిష్కరిస్తున్నాడు
ఎన్ని కవితలు రాసినా
తడి ఆరని కవిత్వం 
అతని సొంతం
ఎన్ని కావ్యాలు వెలువరించినా
తీరని దాహం అతని కవిత్వం

కవిత్వమై ఎదిగినవాడు
కవిత్వమై బతుకుతున్నవాడు
కలంతో కరచాలనం చేస్తూ
కొత్త పాదులను వేస్తున్నవాడు
మట్టికి,ఆకాశానికి వంతెన వేసి
కవితను శిఖరాయమానం చేసినవాడు

నిత్యం పెదవిపై చిరునవ్వును మొలిపించే కవితా వర్షం అతడు
కవిత్వంలో ఆర్ధ్రత
ముఖంలో తాదాత్మ్యత
అతడి సొంతం

ఏ వస్తువైనా.....ఏ దృశ్యమైనా
అతని కవిత్వంలో ఒదిగి పోవాల్సిందే
వస్తువు అతడికి నిత్యనూతనం
దృశ్యం అతడికి అక్షరనైవేద్యం

అతడి కంటికి
తాకని వస్తువు లేదు
రాయని కవిత్వం లేదు
అది అణువు కావచ్చు
పరమాణువు కావచ్చు

అది ఏదైనా ఆకాశమంతా కవిత్వం
మట్టి మనిషంతా స్వచ్ఛం
చీకటిదారులను వెతికే వెలుగు
అతని కవిత్వం
గడ్డిపరకలో లాలిత్యాన్ని చూసే
చూపు అతడి కవిత్వం
అందుకే.....
అది కవిత్వమై ప్రకాశించింది
అతడు కవియై వెలుగొందాడు

( ఎన్.గోపి గారికి అభినందనలతో )

🖌  డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి