*మొగ్గలు*
కలికాలపు మనిషి కల్మషాలను చూసినప్పుడల్లా
ఆవేదనతో నిత్యం రగిలిపోతూనే ఉంటాను
అనుబంధాలు ఆవిరైపోయిన పరిమళాలు

మానవతాలతలు ఎండి రాలిపడుతున్నప్పుడల్లా
వేదనతో నిరంతరం మదనపడుతూనే ఉంటాను
ఆత్మీయతానురాగాలు కనిపించని నిత్యవసంతాలు

గాయాలు నిత్యం మనసుకు తగిలినప్పుడల్లా
గేయమై విషాదరాగాన్ని ఆలపిస్తూనే ఉంటాను
గుండెగుడిలో కనిపించని అనేక బడబాగ్నులు

వసంతాలు గ్రీష్మాలై రంగు మారుతున్నప్పుడల్లా
యజ్ఞంలో సమిధలా ఆహుతైపోతూనే ఉంటాను
కష్టసుఖాలు కనిపించని కావడికుండలు

జ్ఞాపకాలు శూలాలై తగులుతున్నప్పుడల్లా
రెక్కలు లేని ఒంటరిపక్షిలా కొట్టుకుంటూ ఉంటాను
మధురానుభూతులు మరచిపోలేని సుగంధాలు

*భీంపల్లి శ్రీకాంత్*
 January 17 at 04.00pm

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి