*మొగ్గలు*



కుళ్ళు కుతంత్రాలతోనే 
కుట్రలు ఫలిస్తూ ఉంటాయ్ 
రాజకీయం ఎప్పటికీ చిరంజీవి

రాత్రుళ్ళు నిద్రపోతున్నప్పుడే
అవినీతి బీజాలు మొ‌లుస్తుంటాయ్
అధర్మానికి ప్రాణప్రతిష్ట అప్పుడే

జీవితంలో వేసే పాత్రలన్నీ 
రంగులు మారుతూనే ఉంటాయ్
జీవితం ఒక నాటకరంగం

గాయపడిన మనస్సులో
కన్నీటి ప్రవాహాలే ఉంటాయ్
గాయాలతోనే మనిషి రాణింపు

కన్నీటి ఊటలో కనిపించని
బడబాగ్నులు చాలానే ఉంటాయ్
గాయాలను మాన్పించేది కాలమొక్కటే

మనసులో దాగిన వేదనలెన్నో
నిత్యం రగులుతూనే ఉంటాయ్
ఎన్ని మందులు రాసినా గాయాలంతే

శిథిలమైన గోడలు ఎప్పుడూ 
వెక్కిరిస్తూనే ఉంటాయ్
చరిత్ర ఆనవాళ్లు అవే

దుఃఖాన్ని ఎన్నిసార్లు ఒంపుకున్నా 
బాధలు ఎప్పటికీ ఉంటాయ్
కన్నీటికీ తడి ఎక్కువ

నిద్రలేని నిశీథి రాత్రులెన్నో 
నిరర్థకంగా సాగిపోతూనే ఉంటాయ్
రాత్రులు కాలాన్ని నిద్రపుచ్చే  తల్లులు

అక్షరాలతోనే బాధల బరువును 
నిత్యం తగ్గించుకుంటాను
గుండె గాయపడితేనే కవిత్వం 

        🖌  డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్        


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి