రుబాయిలు May 25, 2017


చక్కని  పలకరింపే ఆత్మీయతకు నిదర్శనం 
చల్లని ముచ్చటింపే ఆప్యాయతకు తార్కాణం 
మాటలు ఎడారిలో ఒయాసిస్సులు
మంచిని ప్రభోదించే హృదయానికి వందనం
                 *****
కవిత్వమంటే కాలాన్ని చిత్రిక పట్టడం
కవిత్వమంటే సమాజాన్ని కాగడా పట్టడం
కవిత్వం ఎపుడూ కలంతో కరచాలనమే
కవిత్వమంటే వాస్తవాన్ని వెతికి పట్టడం
                   *****
అవినీతిని అంతమొందించే నీతికి అభివందనం
అన్యాయాన్ని దునుమాడే న్యాయానికి  నీరాజనం
ఎప్పటికీ నిలిచేది ధర్మం ఒక్కటే లోకంలో
నిజాయితీగా బతికే నీతిపరులకు వందనం
                    *****
వాగువంకలు పొంగితేనే పంటలకు ఆనందం
పచ్చని పంటలు పండితేనే పల్లెతల్లికి ఆనందం
పల్లెలంటే భారతీయ పరిమళాలు కదా
కిలకిలరావాల పలుకులే గ్రామసీమకు పరమానందం
                    *****
బాధలను భరిస్తేనే భవిష్యత్తు ఆనందనందనం
కష్టాలను ఓర్చుకుంటేనే కలకాలం సుఖజీవనం
జీవితమంటే ఎత్తుపల్లాల సంగమం కదా 
అవరోధాలను తట్టుకుంటేనే అడుగడుగునా నీరాజనం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి