గంధపుచెట్టు
Dec 12, 2017




ఉస్మానియా...ఒక కల్పవృక్షం
కోరిందల్లా ఇచ్చే గంధపు చెట్టు
వంద ఏళ్ళ సుగంధం
వెయ్యి ఏళ్ళకు ప్రస్థానం

ఎన్ని నక్షత్రాలు ఇక్కడ వెలిగపోయి 
ప్రపంచానికి వెన్నెలను పంచలేదు
ఎన్ని విద్యాబీజాలు ఇక్కడ మోలకత్తి 
మర్రివృక్షాలుగా ఎదగలేదు
ఎన్ని పూలు ఇక్కడ వికసించి
పరిమళాలను పంచలేదు
ఎన్ని ఉదయాలు ఇక్కడ ప్రభవించి
కిరణాలను ప్రసరింపచేయలేదు

ఏ ఉద్యమమైనా ఇక్కడ మొలకెత్తాల్సిందే
ఏ ప్రస్థానమైనా  ఇక్కడ మొదలవ్వాల్సిందే
అన్ని మజిలీలకు ఆయువుపట్టు ఇదే
అన్ని పోరాటాలకు బీజం ఇక్కడే

ఇక్కడ పాదం మోపినప్పుడల్లా
ఉద్యమాలే పలకరిస్తాయి
ఇక్కడ చెట్లను పలకరించినప్పుడల్లా
పుస్తకాలే గుర్తుకువస్తాయి
ఇక్కడ ఏ గోడను తట్టినా 
ప్రపంచ రహస్యాలనే మనకందిస్తాయి
ఇక్కడ ఏ మట్టిని ముద్దాడినా
శ్రమజీవుల వేదనలే ధ్వనిస్తాయి

ఎన్నో ఉద్యమాలకు ఊపిరి పోసింది ఇక్కడే
మరెన్నో పోరాటాలకు బీజం వేసింది ఇక్కడే
తెలంగాణ ఉద్యమానికి పాదులు వేసింది ఇక్కడే
అణచివేతకు అడ్డుగీతలు గీసింది ఇక్కడే


ఉస్మానియాది ఇపుడొక చరిత్ర
శతవసంతాలు నిండిన భవిత
భవిష్యత్తుకు తోవజూపే మార్గదర్శి
గుండె నిండుగా ధైర్యాన్నిచ్చే ఆశలదీపం

ఇదొక చెలెమ....
ఎండిపోయిన హృదయాలకు
ఆత్మీయతను పంచే అనురాగసుగంధం
పల్లెటూరి బతుకుల ఆశలకు
మార్గంచూపే ఆశలసంధ్రం
వేయి ఆలోచనలను ఆవిష్కరింపజేసే
పరిశోధనాలయం
ఎంతోమందిని విద్యావంతులుగా తీర్చిదిద్దిన
విజ్ఞాన కేంద్రం
ఆశలసౌధానికి ఆశయవేదికైన
నిత్యనూతన సౌరభం

అవును...!
ఉస్మానియా నా జీవితపు చుక్కాని
నా బతుక్కి బాటజూపిన అక్షరశిఖరం
నన్ను నేనుగా నిలదొక్కుకోవడానికి
మార్గం వేసిన జీవనాధారం 
నేను నేనై వెలగడానికి 
తోవజూపిన వెలుగుబాట

🖌  డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి